అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఓడిపోయాక గుర్తుకువస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థని గౌరవించనివారు అధికారం కోల్పోయాక దానినే ఆశ్రయిస్తారు. దానిపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పుకుంటారు.
అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన తప్పులు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ గజినీలా మరిచిపోయి, న్యాయం, ధర్మం, నీతి నిజాయితీ, మానవత్వం అన్నీ మంట గలిసిపోతున్నాయని ఆవేదన చెందుతుంటారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ లీగల్ సెల్ సభ్యులతో సమావేశమయ్యి చెప్పిన మాటల సారాంశం ఇదే.
మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతానని జగన్ చెప్పుకున్నారు. కానీ ఆయనకు ఆ నమ్మకం ఉన్నట్లయితే, ఆయన మాటల్లో, కళ్ళలో, బాడీ లాంగ్వేజ్‌లో ఆ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించేది. కానీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆయన కంట్లో కన్నీళ్ళు ఒక్కటే తక్కువనిపిస్తుంది!
ఆయన విచారంగా మొహం పెట్టుకొని ఆ విధంగా మాట్లాడుతుంటే, ‘ఇంతకీ ఆయన మాకు ధైర్యం చెపుతున్నారా లేక తన గోడు మాకు మొర పెట్టుకొని ధైర్యం పొందాలనుకుంటున్నారా?’ అని వారికీ అనుమానం కలిగే ఉంటుంది.
హైదరాబాద్‌లో రూ.11 కోట్ల నోట్ల కట్టలు దొరికిపోవడంతో మద్యం కుంభకోణం కేసు విచారణలో బలమైన ఆధారం లభించినట్లయింది. కనుక నేడో రేపో జగన్ అరెస్ట్ ఖాయమని మంత్రులు జోస్యం చెపుతున్నారు.
కానీ జగన్ గురించి ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అరెస్ట్ కానంత వరకే ఆయన భయపడతారు కానీ ఒకసారి అరెస్ట్ అయితే ఇక పులే!
కనుక తాను అరెస్ట్ అయితే వైసీపీ ‘లీగల్ సెల్’ ఏం చేయాలో చెప్పుతున్నట్లున్నారు. అరెస్ట్ చేస్తే ఇలా లోపలకు వెళ్ళి అలా బయటకు వచ్చేస్తారు. అక్కడితో న్యాయం ధర్మం గెలిచేసినట్లే.. అని ఇప్పుడు అందరూ గట్టిగా నమ్ముతున్నారు కనుక ధైర్యంగా ప్రజల మద్యకు వెళ్ళిపోవచ్చు.
హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదన్నట్లు, జగన్‌కి కూడా తన బలం తెలిసి ఉండదు. కనుకనే లీగల్ సెల్ సభ్యులతో ఇలా బేలగా మాట్లాడుతున్నారు అంతే! ఆ తర్వాత ఈ కేసుని జగన్ ఎలా నడిపిస్తారో, ఎన్నేళ్ళు నడిపిస్తారో అందరూ కళ్ళారా చూడవచ్చు.
కనుక అరెస్ట్ గురించి జగన్ ఇంత ఆందోళన చెందనక్కర లేదు. జగన్ అరెస్ట్ అవుతారని టీడీపీలు మరీ ఇంతగా సంతోషపడిపోనక్కరలేదు.






