జగన్ బెంగళూర్ ప్యాలస్ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేరుకున్న నేపథ్యంలో ఇక వైసీపీ లో ఉన్న పెండింగ్ ఓదార్పు పనులకు షెడ్యూల్ షురూ అయినట్లేనా అన్న చర్చ నడుస్తుంది.
ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లిన వైసీపీ సీనియర్ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వైస్ జగన్ ఓదార్పు కోసం రెండు నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ నెల ప్రారంభంలో ఆయనను పరామర్శించడానికి జైలు యాత్రకు రంగం సిద్ధం చేసిన జగన్, ప్రభుత్వం హెలికాఫ్టర్ లాండింగ్ కు అనుమతి నిరాకరించడంతో వెనక్కి తగ్గారు. దానితో కాకాని పట్ల వైస్ జగన్ తీరుతో ఆయన కుటుంబ సభ్యులు అసంతృత్తికి లోనైనట్టు సమాచారం.
అందుచేత ఈసారి జగన్ తాడేపల్లి టూర్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి కి ఓదార్పు అందించాల్సిందే. ఇక ఏపీ మద్యం కేసులో అరెస్టయిన మరో వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్ ఓదార్పు కోరుకుంటున్నారు. నెల రోజుల నుంచి విజయవాడ జైల్లో మగ్గుతున్న చెవిరెడ్డి ని పరామర్శించడం కూడా జగన్ తక్షణ కర్తవ్యంలో ఒక భాగమే.
ఇక ఇదే కేసులో ఎప్పుడో అరెస్టయిన భారతి బంధువు మరియు లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి కూడా జగన్ పరామర్శకు మిస్ అయ్యారు. ఇక తాజాగా అరెస్టయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా జగన్ తన ఓదార్పును కొనసాగించవలసి ఉంటుంది.
సిట్ విచారణ మిథున్ రెడ్డి వరకు వచ్చి మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది అంటే అది దాదాపు తాడేపల్లి ప్యాలస్ ద్వారానికి దారులు తెరుచుకున్నట్టుగానే భావించాలి. ఇలా వైసీపీ లో సీనియర్ నాయకులు, పార్టీ కీలక నేతలు జగన్ పరామర్శల కోసం జైళ్లలో వేచి చూస్తున్నారు.
అయితే ఈ సారి జగన్ తాడేపల్లి టూర్ మొత్తం ఈ పరామర్శలు, ఓదార్పు యాత్రలతో నిండిపోయిందనే చెప్పాలి. మరి వీరిలో ఎంతమందికి జగన్ పరామర్శ దక్కుతుంది .? ఎంతమందితో జగన్ ములాకత్ లో మిలాఖత్ అవుతారు అనేది వేచి చుడాలి.
లిక్కర్ స్కాం లో అరెస్టయిన చాలామంది వైస్ జగన్ కు అత్యంత సన్నిహితులు, వైసీపీ పార్టీకి ముఖ్యమైన నాయకులు. వీరందరిని జైలుకెళ్లి ఓదార్చడం, ఆయా కుటుంబాలను పరామర్శించడం జగన్ కు అత్యంత ప్రధానం.
జగన్ తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే ఆలోచన అరెస్టయిన నేతలలో కానీ సదరు వ్యక్తులలో కానీ వస్తే అది వైసీపీ పార్టీకే కాదు జగన్ కు అత్యంత క్లిష్ట పరిస్థితులను తెచ్చిపెడుతుంది.
అందుచేత జగన్ తన బిజీ రాజకీయ షెడ్యూల్ లో కొంత భాగం అరెస్టయిన నాయకుల పరామర్శలకు, ఓదార్పులకు కేటాయించక తప్పని పరిస్థితి. అయితే గతంలో జగన్ చేసిన ఓదార్పులు వైసీపీ కోరుకున్నవి, ఆయన ఇష్టానుసారం నడిచినవి, కానీ ఇప్పుడు జగన్ చెయ్యాల్సి వస్తున్న ఓదార్పులు, పరామర్శలు వైసీపీ కోరుకున్నవి కాదు కానీ తప్పడం లేదు.






