సమస్యలు, సంతాపాలు కాదు.. బలప్రదర్శన యాత్రలు?

Jagan Bhimavaram roadshow

కూటమి ప్రభుత్వం, మంత్రులు, మూడు పార్టీల నాయకులు అంగీకరించినా, అంగీకరించకపోయినా.. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి అడుగు బయట పెట్టినా, ఆయన దేని కోసం బయలుదేరినా వేలాదిమంది వైసీపీ శ్రేణులు ఆయన వెంట వాహనాలతో ఫాలో అవుతుంటారు. బహుశః వైసీపీ నేతలే వారిని ఏర్పాటు చేసినా, తమ అధినేతని చూసినప్పుడు వారిలో కనిపించే ఆ ఉత్సాహం చూస్తున్నప్పుడు నేటికీ ఆయనకు రాష్ట్రంలో బలం, పార్టీ శ్రేణుల మద్దతు ఉందనే విషయం స్పష్టం చేస్తోంది.

ADVERTISEMENT

ఈరోజు భీమవరంలో ఆక్వా రైతులను కలిసిన జగన్, అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది పరిపాటే కానీ అక్కడ కూడా వైసీపీ శ్రేణుల హడావుడి షరా మామూలే. ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ఫ్లెక్సీ రాజకీయాలు ఎవరూ ఊహించలేని విధంగా ఉంటాయి. అక్కడ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజా నిదర్శనం.

జనసేన కార్యకర్తలు “ఎవడ్రా మనల్ని ఆపేది?” అనే నినాదం చేస్తుంటే “డిల్లీ వాళ్ళ వల్లే కాలేదు… గల్లీలో జగన్‌ని ఆపే దమ్ముందా?”, “ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం” అంటూ జగన్‌ ఫోటోలతో వేసిన ఫ్లెక్సీలు టీడీపీ, జనసేనలకు మాత్రమే కాదు బీజేపీకి కూడా సవాల్ విసురుతున్నట్లే ఉన్నాయి. “డిల్లీ వాళ్ళ వల్లే కాలేదు” అనే సవాలుని బిజేపి స్వీకరిస్తే ఏమవుతుందో తెలిసి ఉన్నా ఇలా సవాలు విసరడం అంతర్యం ఏమిటనే సందేహం కలుగుతోంది.

జగన్మోహన్ రెడ్డి భీమవరం వచ్చింది ఆక్వా రైతుల సమస్యల గురించి తెలుసుకొని మాట్లాడేందుకు. కానీ వైసీపీ శ్రేణులు చేసిన హడావుడితో ఇదొక బలప్రదర్శన యాత్రగా మారిపోయింది.

ఇందుకు మరో ఉదాహరణ అయన కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డికి నివాళులు అర్పించేందుకు వెళ్ళినప్పుడు వైసీపీ శ్రేణులు చేసిన హడావుడి. నిజానికి ఇదొక సంతాప కార్యక్రమం. కానీ అక్కడ కూడా బలప్రదర్శన చేయడంతో ఆయన చనిపోయారనే బాధ, సంతాపమే లోపించినట్లనిపిస్తుంది.

కనుక జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని పరీక్షించుకునేందుకు అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటారా? లేక కూటమి ప్రభుత్వానికి తన బలప్రదర్శన చేసేందుకే వస్తుంటారా?అనే సందేహం కలుగుతుంది తప్ప ఆయన ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు లేదా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు వచ్చినట్లు అనిపించదు.. వైసీపీ శ్రేణుల సమీకరణ, వారి ఉత్సాహం, హడావుడి చూస్తే!

ADVERTISEMENT
Latest Stories