తెలంగాణలో పవర్ పాలిటిక్స్, ఏపీలో టామ్ అండ్ జెర్రీ షో!

KTRr-jagan-chandrababu-naidu-revanth-reddy

కేసీఆర్‌ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే, జగన్‌ హయాంలో ఏపీలో రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసాలు జరిగాయి. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు, ఏపీలో అభివృద్ధి జరుగుతున్నాయి.

ADVERTISEMENT

రేవంత్‌ రెడ్డి మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మ్యాన్‌గానే బరిలో దిగి మొదట్లో బాగానే స్కోర్ చేశారు. ప్రత్యర్ధి బిఆర్ఎస్ టీమ్‌ని కట్టడి చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేయగలిగారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య ‘పవర్ ప్లే’ మొదలవడంతో రేవంత్‌ రెడ్డి తడబడుతున్నారు.

ఒకేసారి నాలుగైదు కేసుల విచారణ జరుగుతున్నా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావులు ఏమాత్రం భయపడకపోగా రేవంత్‌ రెడ్డి మీద ఎదురుదాడి చేస్తూ, ‘సెల్ఫ్ డిఫెన్స్’కు పరిమితం అయ్యేలా చేయగలిగారు.

హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ళు కూల్చివేయడం, అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడం, పరిశ్రమలు, పెట్టుబడులు సాధించలేకపోవడం వంటి అంశాలతో బిఆర్ఎస్ నేతలు రేవంత్‌ రెడ్డిని నిలువరించగలుగుతున్నారు.

తాజాగా ‘అమృత్’ పధకంలో రేవంత్‌ రెడ్డి తన బావమరిదికి చెందిన సోదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి రూ.1,137 కోట్ల విలువైన పనులు దక్కేలా చేశారని కేటీఆర్‌ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి పదవి ఊడినా ఆశ్చర్యం లేదని కేటీఆర్‌ చెపుతున్నారు.

రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలకు భూసేకరణకు ప్రభుత్వం సిద్దమవడంతో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గ్రామ సభ నిర్వహించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌, సబ్ కలెక్టర్‌ తదితరులపై కర్రలు, రాళ్ళతో దాడులు చేశారు కూడా. ఇప్పుడు ఈ ఘటనపై రెండు పార్టీల మద్య రాజకీయాలు సాగుతున్నాయి.

ఫార్ములా-1 రేసింగ్ నిర్వహణ కొరకు కేటీఆర్‌ రూ.55 కోట్లు దుర్వినియోగం చేశారని, నేడో రేపో ఆయన జైలుకి వెళ్ళక తప్పదని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌పై దాడి వెనుక బిఆర్ఎస్ నేతలే ఉన్నారంటూ మంత్రులు ఆరోపిస్తుంటే, పోలీసులు అప్పుడే బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాట్నా, నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఈవిదంగా తెలంగాణలో ‘పవర్ పాలిటిక్స్’ ‘కుమ్మక్కు రాజకీయాలు’ సాగుతుంటే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిపదంలో అడుగులు వేస్తోంది.

ఏపీలో వైసీపి-టిడిపిల మద్య కూడా జోరుగా రాజకీయాలు సాగుతున్నప్పటికీ, అక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్, ఇక్కడ వైసీపికి లేకపోవడంతో చంద్రబాబు నాయుడిదే పైచేయిగా సాగుతున్నాయి. కనుక టామ్ అండ్ జెర్రీ షోలా సాగుతున్న టిడిపి-వైసీపి రాజకీయాలు అభివృద్ధికి అవరోధంగా లేవనే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories