
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలలో ఓడిపోవడం, ఫిరాయింపులు, కేసులు అనే మూడు కారణాలతో నష్టపోతుంటుంది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే అధినేతకి పార్టీ నేతలకు గ్యాప్ పెరగడం వలన కలిగే నష్టం ఒకటీ మరో ఎత్తు. వైసీపీలో అదే జరిగిందని చిరకాలం జగన్‌కి కుడి భుజంగా చేసిన విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
జగన్ చుట్టూ ఉన్న కోటరీగా ఏర్పడిన సజ్జల, చెవిరెడ్డి, వైవీ, పెద్దిరెడ్డి వంటి వారు తమ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలే చూసుకున్నారు తప్ప పార్టీకి నష్టం కలుగుతున్నా జగన్‌ని అప్రమత్తం చేయలేదని విజయసాయి రెడ్డి చెప్పేశారు.
Also Read – యాదగిరిగుట్టకు ఓ బోర్డు… అవసరమా?
అయితే వైసీపీలో విజయసాయి రెడ్డి కూడా చాలా కాలం ఆ కోటరీలో ఉన్నారు. అప్పుడు ఆయన కూడా ఇంచుమించు ఇలాగే వ్యవహరించారు. కనుక వైసీపీ పతనానికి అందరితో పాటు ఆయన కూడా కారకుడే.
అయితే పూర్తిగా కోటరీనే నిందించడం కూడా సరికాదు. ఓ పార్టీకి, ఓ రాష్ట్రానికి నాయకుడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి వీటన్నిటినీ గుర్తించి, దానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. కానీ తాను కోటరీలో బందీ అయిపోయానని, పార్టీ నేతలకు, కార్యకర్తలకు దూరమైపోయానని, ఆ కారణంగానే ఎన్నికలలో ఓడిపోయాననే విషయం ఓడిపోయే వరకు జగన్ తెలుసుకోలేకపోవడం ఖచ్చితంగా వైఫల్యమే కదా?
Also Read – జగన్ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని
కానీ నేటికైనా జగన్ కోటరీ బంధనాలు తెంచుకోగలిగారా?అంటే కాదనే చెప్పొచ్చు. అధికారం కోల్పోయి 9 నెలలవుతున్నా ఇంతవరకు ప్రజల మద్యకు, శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోవడం అనే రెండు తప్పుడు నిర్ణయాలు ఇదే సూచిస్తున్నాయి.
ఒకవేళ ఎవరైనా ఈ తప్పుడు సలహాలు ఇచ్చినా, జగన్ పార్టీలో సీనియర్ నేతలందరితో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. తద్వారా జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ అవే తప్పులు కొనసాగిస్తుండటం గమనిస్తే జగన్ కోటరీలో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారని స్పష్టమవుతోంది. అందుకే వైసీపీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారబోతోందని విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు.
Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!
‘జగన్-కోటరీ’ వలన వైసీపీకి కలిగిన, ఇంకా కలుగుతున్న నష్టంతో పాటు, విజయసాయి రెడ్డి చెప్పిన ఈ కోటరీ కబుర్లతో కూడా వైసీపీకి మరింత నష్టం కలుగుతుంది.
రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెపుతూనే ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో విజయసాయి రెడ్డి వైసీపీని మరోసారి చావు దెబ్బ తీశారని చెప్పొచ్చు.
విజయసాయి రెడ్డి పార్టీ వీడితేనే ఆయనకు విలువలు విశ్వసనీయత లేవని విమర్శించిన జగన్, ఇప్పుడు తన గురించి ఆయన ఇన్ని మాటలు అంటే జీర్ణించుకోగలరా? లేరు. కనుక మళ్ళీ అంబటి రాంబాబు, రోజా, గుడివాడ, సజ్జల వంటి వారందరికీ మళ్ళీ పనిబడిన్నట్లే!