వర్తమాన రాజకీయాలలో చాలా ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయకులలో సీపీఐ నారాయణ ఒకరు.
ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొనప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శించడం అవసరమే. చాలా మంచిదే. కానీ జగన్ వేలాదిమందిని పోగేసి ఏదో పెళ్ళి ఊరేగింపులా వెళ్ళి పరామర్శించడం, ఆ పర్యటనలో డీజేలు, జగన్ పాటలు పెట్టుకోవడం చాలా తప్పు. ఆయన ఎవరినైనా పరామర్శించాలంటే ముఖ్య నేతలతో కలిసి వెళ్ళి పరామర్శించి రావచ్చు కదా? పరామర్శలకు ఇంత హంగామా అవసరమా? ఆదేమైన పెళ్ళి ఊరేగింపా లేక నామినేషన్స్ వేసేందుకు వెళుతున్నారా?
తన వెంట వేలమందిని పోగేసుకొని వెళ్ళి, రెచ్చగొట్టే ప్రకటనలు చేయిస్తూ ఆయనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
పల్నాడు పర్యటనలో ఆయన కారు కింద సింగయ్య అనే వైసీపీ కార్యకర్త పడి చనిపోతే జగన్ సానుభూతి చూపే బదులు, ఆ పేరుతో శవరాజకీయాలు చేశారు. చివరికి ఆయన శవాలను కూడా విడిచిపెట్టడం లేదు. శవాలని కూడా వాడేసుకొని రాజకీయాలు చేయాలనే తాపత్రయం ఎందుకు? నీకు అని నేను జగన్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
మామిడి రైతులతో మాట్లాడే మిషతో రేపు జగన్ మరోసారి దండయాత్రకు బయలుదేరుతున్నారు. నీ పార్టీ నేతలని, కార్యకర్తలని మీ తాడేపల్లి ప్యాలస్‌కి పిలిపించుకొని మాట్లాడుతావో అదేవిదంగా మామిడి రైతులను కూడా పిలిపించుకొని మాట్లాడవచ్చు లేదా వారిపై అంత సానుభూతే ఉన్నట్లయితే నలుగురు ముఖ్య నేతలతో కలిసి వెళ్ళి మాట్లాడవచ్చు.
కానీ ఇన్ని వేలమందిని పోగేసి డీజేలు, పాటలు పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళాల్సిన అవసరం ఏమిటి?మామిడి రైతుల సమస్యల కంటే వారి పేరుతో మరోసారి బలప్రదర్శన చేసేందుకే జగన్ బయలుదేరుతున్నారు,” అన్నారు సీపీఐ నారాయణ.
ఇంతకాలం జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదని అందరూ అడుగుతుండేవారు. కానీ జగన్ బలప్రదర్శనలు చూసిన తర్వాత ఎందుకు వస్తున్నారు? అని సీపీఐ నారాయణ వంటివారు సైతం అడుగుతున్నారు.
అయినా జగన్ ఇలా వారం వారం పరమర్శల యాత్రల పేరుతో ప్రభుత్వానికి, పోలీసులకు పరీక్షలు పెడుతూ ఉంటే వాటిలో పాస్ అవుతూనే ఉండాలా?ఇలా ఎంత కాలం?” అని టీడీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నారు.




