టిడిపి, బీజేపీలు మిత్రపక్షాలు కావు. కానీ గురువారం అర్దరాత్రి 12.30 గంటల వరకు చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. టిడిపిని మళ్ళీ ఎన్డీయేలో చేరాలని అమిత్ షా కోరారని, అందుకు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అలాగే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపి, జనసేనలతో పొత్తుకి బీజేపీ కూడా సిద్దమైందని, సీట్ల సర్దుబాట్లపై వారు చర్చించారని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అమరావతికి బయలుదేరగానే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. జనసేన, బీజేపీలు ఏపీలో కలిసి పనిచేయనప్పటికీ సాంకేతికంగా నేటికీ పొత్తులోనే ఉన్నాయి. ఆయన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు.
మూడు పార్టీల నేతలు ఢిల్లీలో ఇలా వరుసగా సమావేశాలవుతుంటే, ఇక్కడ ఏపీలో వైసీపి నేతలకు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఆందోళన, గుండెల్లో ఏదో తెలీని గుబులు కలగడం సహజం. ఎందుకంటే టిడిపి, జనసేనలే కలవకూడదని వారు కోరుకుంటే, ఇప్పుడు వాటితో బీజేపీ కూడా కలుస్తుందనే భయమే. బహుశః అందువల్లే శాసనసభ బడ్జెట్ సమావేశాలలో నేడు జగన్మోహన్ రెడ్డి కొంచెం ‘డల్’గా కనిపించారేమో?
అయితే ఇక్కడ కూర్చొని ఎంత గట్టిగా చేతులు పిసుక్కున్నా నొప్పే తప్ప ఢిల్లీలో ఏమి జరుగుతోందో తెలీదు. ఏదో జరిగిపోయాక జరిగే నష్టాన్ని ఊహించడం కష్టం. కనుక జగన్మోహన్ రెడ్డి కూడా శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
ఢిల్లీ ఎందుకంటే మళ్ళీ అదే పాత పాట… రాష్ట్రానికి రావలసిన నిధులు, అభివృద్ధికి సంబందించిన అంశాల గురించి మాట్లాడేందుకని చెప్పుకొనే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కానీ మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతుంటే, ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించడానికి అంటే జనం నవ్వకుండా ఉంటారా?
కనుక టిడిపి, జనసేనలతో చేతులు కలపవద్దని, ఎన్నికలలో వాటికి సహకరించవద్దని ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్ధించేందుకే కావచ్చు. ఇందుకు ప్రతిగా టిడిపి, జనసేనల కంటే బీజేపీకి ఎక్కువ లోక్‌సభ సీట్లు ఇస్తామని ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోయినా లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరి మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడతామని నచ్చజెప్పుకునేందుకు కావచ్చు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడంలో తప్పు లేదుగా!




