సిఎం చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ద్వేషం, అసూయ. అది మానవ సహజమని సరిపెట్టుకోవచ్చు. కానీ అయనపై ద్వేషంతో రాష్ట్రంలో ఓ ప్రాంతాన్ని ద్వేషించడాన్ని ఏమనుకోవాలి?
జగన్ ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో అమరావతిని 5 ఏళ్ళు పాడుబెట్టారు. సరే! మూడు రాజధానులో విశాఖ రాజదానో కట్టేసి చూపిస్తే అందరూ సంతోషించేవారు. జగన్‌ని మెచ్చుకునేవారు. కానీ ఏమీ చేయకుండానే దిగిపోయారు!
కానీ ఆయన అసమర్దతకి, అధికార దుర్వినియోగానికి రుషికొండపై ప్యాలస్‌లు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలబడి వెక్కిరిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కారు. చేతిలో అధికారమూ లేదు. అయినా అమరావతి గురించి వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. అవన్నీ దుష్ప్రచారమని కూటమి ప్రభుత్వం కొట్టి పడేస్తోంది.
కనుక అమరావతి నిజంగానే వరద నీళ్ళలో మునిగిపోయిందని నిరూపించడం జగన్‌కి పెద్ద కష్టమేమీ కాదు. మీడియాని వెంటబెట్టుకొని ఒక్కసారి అమరావతిలో పర్యటిస్తే చాలు. ఏయే ప్రాంతాలు నీళ్ళలో మునిగిపోయాయో ప్రజలకు చూపవచ్చు కదా? అక్కడ రాజధాని కట్టడం తప్పనే తన వాదనలు నిరూపించవచ్చు కదా?
కానీ జగన్ ఎవరైనా చనిపోతే లేదా జైలులో ఉన్న తన పార్టీ నేతలని పరామర్శించడానికి మంది మార్భలం వేసుకొని బయలుదేరుతుంటారు. కానీ పక్కనే ఉన్న అమరావతిలో పర్యటించరు. ఎందువల్ల? అంటే తాము చేస్తున్నది దుష్ప్రచారమే తప్ప వాస్తవం కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోతుందనే భయంతోనే!
అమరావతి మునిగిపోతోందనే వైసీపీ దుష్ప్రచారాన్ని టీడీపి మంత్రులు ఖండించడంతో సరిపెడుతున్నారు. కానీ అమరావతిలో పర్యటించి నిరూపించాలని జగన్‌కి సవాలు విసిరితే బాగుంటుంది కదా?






