అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్-5 జోనులో వివాదాస్పద 1,402 ఎకరాలలో జగన్ ప్రభుత్వం పట్టాలు వేసి పేదలకు సెంటు భూములు పంచి పెట్టింది. వాటిలో ఇళ్ళ నిర్మాణానికి సిద్దమవగా, రాష్ట్ర హైకోర్టు నేడు స్టే విధించింది.
వీటిపై సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకొంటే అక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చుకోవచ్చు కానీ అమరావతిపై తుదితీర్పుకు లోబడి అవి ఉంటాయంది. కానీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకి వక్రభాష్యం చెపుతూ ‘రాజధానిలో భూముల పంపిణీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వాటిలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు లేవంటూ వాటిలో వెయ్యి కోట్లతో ఇళ్ళ నిర్మాణానికి సిద్దమైపోయింది.
“ఆ వివాదాస్పద భూములలో వెయ్యి కోట్ల ప్రజధనం ఖర్చు చేసి ఇళ్ళు నిర్మిస్తే, రేపు సుప్రీంకోర్టు విరుద్దంగా వస్తే ఏం చేస్తారని?” హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి జవాబు చెప్పకుండా, హైకోర్టు తాజా తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది!
దీనిపై హైకోర్టుకే సంతృప్తికరమైన జవాబు చెప్పుకోలేకపోయిన జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడా దాంకి ఇదే ప్రశ్న ఎదురవవచ్చు. అయితే కోర్టుకేసులలో ఆరితేరిపోయిన జగన్ ప్రభుత్వానికి, అవి వివాదాస్పద భూములను, వాటిని పంచిపెట్టకూడదని, ఒకవేళ పంచిపెట్టినా వాటిలో ఇళ్ళు నిర్మించకూడదని, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళినా ప్రయోజనం ఉండదని తెలియకనే ఇవన్నీ చేస్తోందా? అంటే ఖచ్చితంగా కాదనే చెపొచ్చు.
అమరావతి కట్టలేక మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక ఏవిదంగా ఆ కేసులను సుప్రీంకోర్టులో పడేసి చేతులు దులుపుకొందో, దీనిని అదే విదంగా సుప్రీంకోర్టుకి చేర్చేస్తే అది ఎన్నికలు పూర్తయ్యేవరకు అక్కడే పడి ఉంటుంది. అప్పుడు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి పేదలకు ఇళ్ళు కట్టక్కరలేదు. కానీ తాము పేదలకు ఇళ్ళు కట్టించి ఇద్దామనుకొంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడి నిలిపివేయించారని ఎదురు నిందించవచ్చు. పైగా తాము పేదల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నామని గొప్పగా చెప్పుకోవచ్చు.
కనుక రాజధాని ప్రాంతంలో సెంటు భూముల లేఅవుట్లు వేయడం మొదలు ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం వరకు అన్నీ దురాలోచనలే అని అర్దమవుతోంది.



