జగన్ బాధితులు ఆయనకే మొర పెట్టుకోవడం చూస్తునప్పుడు గొర్రెలు కసాయివాడినే నమ్ముతాయనే నానుడి గుర్తురాక మానదు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ కంపెనీకి మొదట 5,148 ఎకరాలు, ఆ తర్వాత మరో 3,200 ఎకరాలు కలిపి మొత్తం 8,348 ఎకరాలు ఇచ్చేశారు.
పెద్ద పెద్ద పోర్టులు, విమానాశ్రయాలకు మాత్రమే అంత భూములు కేటాయింస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇండోసోల్ కంపెనీ జగన్‌కు సన్నిహితుడైన నర్రా విశ్వేశ్వర్ రెడ్డిది కావడంతో ఆయన దరఖాస్తు చేసుకోగానే ముందూ వెనుకా చూడకుండా8,348 ఎకరాలు కేటాయించేశారని మంత్రి నాదెండ్ల కొన్ని నెలల క్రితం ఆరోపించారు.
ఇండోసోల్ కంపెనీలో శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా 49 శాతం షేర్స్ కొందని, ఇది ‘క్విడ్ ప్రో’ పద్దతిలో జగన్ తన సన్నిహితులకు, బినామీలకు భూములు బదిలీ చేయడమే అని మంత్రి నాదెండ్ల ఆరోపించిన సంగతి తెలిసిందే.
జగన్ క్విడ్ ప్రో భూభాగోతాల వలన నష్టపోయిన రైతులు వచ్చి జగన్‌కు మొర పెట్టుకోవడం ఆశ్చర్యమనుకుంటే, వారి కోసం తాను పోరాడుతానని జగన్ హామీ ఇవ్వడం మరీ విచిత్రం.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, ఎమ్మెల్సీ తూమటి మాధవరావు నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో భూములు కోల్పోయిన రైతులను వెంటబెట్టుకొని మంగళవారం తాడేపల్లి ప్యాలస్‌కు రాగా జగన్ వారిని ఓదార్చి త్వరలో తాను వారి గ్రామానికి వచ్చి వారి కోసం పోరాడుతానని హామీ ఇచ్చి పంపేశారు.
ఒకవేళ జగన్ నిజంగానే వారి కోసం నెల్లూరు పర్యటనకు బయలుదేరితే ఆ క్విడ్ ప్రో భూభాగోతం బయట పెట్టేందుకు మంత్రి నాదెండ్లకు మరో అవకాశం లభిస్తుంది. కనుక జగన్ కరేడు గ్రామానికి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్ళేందుకు సిద్దపడితే ఇండోసోల్ కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు ధారాదత్తం చేశారని రైతులు నిలదీస్తే జవాబు చెప్పుకోవడం కష్టమవుతుంది.




