ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతోంది. అప్పటి నుంచి వైసీపీ అధినేత తన ప్యాలస్‌లోనే కాలక్షేపం చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ముఖ్యనేతలను ఎంతగానో వేధించి, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించినందున, ఆయన కూడా తమకి అలాంటి ట్రీట్‌మెంటే ఇస్తారని జగన్, వైసీపీ నేతలు భావించారు. భయపడ్డారు కూడా.
కానీ తమ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే చెప్పారు. నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే చెప్పారు.
జగన్‌ని అరెస్ట్ చేయాలనుకుంటే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే చేసి ఉండేవాడినన్నారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి సెకీతో చేసుకున్న ఒప్పందం ఒక్కటి చాలు జగన్‌ని అరెస్ట్ చేసి లోపల వేయడానికి. కానీ ని కానీ తాను కక్ష సాధింపులను ఇష్టపడనని చెప్పారు. వైసీపీ నేతల ఆర్ధిక నేరాలు, భూకబ్జాల విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది తప్ప తమ ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించదని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇంతవరకు అవినీతికి, దౌర్జన్యాలకు పాల్పడిన పలువురు వైసీపీ నేతలు, వారి అనుచరులపై కేసులు నమోదయ్యాయి తప్ప వారందరినీ వక్రమార్గంలో నడిపించిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజుని చిత్ర హింసలు పెట్టినందుకు కేసు నమోదు చేసినప్పటికీ, దాంతో నాకు సంబంధమే లేదని జగన్ చాలా సులువుగా తప్పించుకోగలరు.
జగన్‌పై కక్ష సాధింపులకు పాల్పడబోమని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడే చెప్పారు. ఈవిదంగా ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆయనే జగన్‌కు లైన్ క్లియర్ చేసిన్నట్లు భావించవచ్చు.
సంక్రాంతి తర్వాత జనం మద్యకు జగన్ రాబోతున్నారు కనుక మళ్ళీ చెలరేగిపోతూ సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయడం ఖాయమే.




