ఆడుదాం ఆంద్రా… బిఆర్ఎస్ ప్లేయర్స్ ఇంకా రాలేదే?

Jagan-KCR-Andhra-Pradesh-BRS

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మైండ్ గేమ్స్ లేదా రాజకీయ చదరంగ పోటీలు పెట్టుకోవడం చాలా కామన్! కానీ ఆంధ్రాలో గత పదేళ్ళుగా రోజూ ఇవే నడుస్తున్నాయి. ఇంత రాజకీయ క్రీడాస్పూర్తి బహుశః మరే రాష్ట్రంలో ఉండదేమో?అందుకే ఏపీలో రాజకీయాలు జాస్తి… అభివృద్ధి నాస్తి అన్నట్లు తయారైంది.

ADVERTISEMENT

జగన్‌ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ అని ఇప్పుడు కొత్తగా చెపుతున్నప్పటికీ గత నాలుగున్నరేళ్ళుగా ప్రజలతో, ప్రతిపక్షాలతో ఆడుకుంటూనే ఉంది. అయితే ఆంధ్రాలో ఆంధ్రావాళ్ళు మాత్రమే ఆడుకుంటే పారదర్శకంగా ఉండదని కేసీఆర్‌ భావించారో ఏమో, బిఆర్ఎస్ ప్లేయర్లకి కూడా అవసరమైన కోచింగ్ ఇచ్చి, బ్యాటుబాలు వంటివన్నీ సమకూర్చి పంపించారు.

కాస్త ఆలస్యమైనప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో ఆట మొదలు పెడదామనుకుని జెండాలు కూడా పెట్టించారు. కానీ ఆ దిశలో ఆట మొదలుపెడితే ఓడిపోవడం ఖాయమని అనుకున్నారో ఏమో మిడిల్ డ్రాప్ చేసేశారు.

ఇటీవల జగన్‌ హైదరాబాద్‌ వెళ్ళి కేసీఆర్‌ని ‘ఆడుదాం ఆంద్రా’కు ఆహ్వానించే ఉంటారు. ఇప్పటికే తెలంగాణ నుంచి ఓ ప్లేయర్ (వైఎస్ షర్మిల) వచ్చి ఏపీలో ఆట మొదలుపెట్టేశారు. ఎన్నికల గంట మొగితే రేవంత్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌ బ్యాచ్ మొత్తం ఏపీలో దిగిపోవడం ఖాయం.

కనుక బిఆర్ఎస్‌ ప్లేయర్లని కూడా బరిలో దించితే ‘ఆంధ్రా సెంటిమెంటు’ వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని జగన్‌ కేసీఆర్‌కు నచ్చజెప్పే ఉంటారు.

ముఖ్యంగా చెల్లి వైఎస్ షర్మిలని తన నోటితో విమర్శించడం కేసీఆర్‌, ఆ నాలుగు ముక్కలు బిఆర్ఎస్‌ నేతల నోటితో చెప్పిస్తే హనుమాన్‌ సినిమా వీఎఫ్ఎక్స్ ఎఫెక్టులా చాలా ప్రభావంగా ఉంటుంది.

పనిలో పనిగా ‘కామన్ ఎనిమీస్’ చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌, దగ్గుబాటి పురందేశ్వరి వంటివారితో కూడా ఆడుకొనే అవకాశం లభిస్తుందని కేసీఆర్‌కు నచ్చజెప్పే ఉంటారు.

ఏపీలో వైసీపి వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్‌ సాయపడితే జగన్మోహన్‌ రెడ్డి ఆ రుణం ఉంచుకొనే టైప్ కాదని బిఆర్ఎస్‌ నేతలకు కూడా తెలుసు.

కనుక ఎన్నికల గంట మోగేలోగానే ఏపీలో పడుకున్న బిఆర్ఎస్‌ ప్లేయర్లను కూడా నిద్రలేపి మైదానంలో దింపడం ఖాయమనే భావించవచ్చు.

స్నేహం కోసం కాకపోయినా ఉమ్మడి శత్రువుల కోసమైనా ఈ మాత్రం పరస్పరం సహకరించుకోకపోతే ఇక ఈ స్నేహానికి అర్దం ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories