ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరికీ ఓ నిశ్చితాభిప్రాయం ఉంది. ప్రజలు తమ మొహం చూసే ఎమ్మెల్యేలను గెలిపించారని!
కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో వారి అభిప్రాయం నిజం కావచ్చు. కానీ పార్టీలో సీనియర్ నేతలు తమ సొంత బలంతోనే ఎన్నికలో గెలుస్తుంటారు.
ఉదాహరణకు వైసీపీలో బొత్స, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వంటివారున్నారు. అదేవిదంగా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటి పలువురు సీనియర్ నేతలు తమ సొంత బలంతో ఎన్నికలలో గెలుస్తుంటారు.
కనుక అటువంటి వారికి కేసీఆర్ లేదా జగన్ ప్రభంజనం కొంత తోడ్పడవచ్చేమో కానీ తమ వల్లనే సీనియర్లు గెలిచారని చెప్పుకోలేరు.
ఇంతకీ విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీజేపిలో చేరిపోయారు. దీనిని బీఆర్ఎస్ అధిష్టానం జీర్ణించుకోవడం కష్టమే. కనుక సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు మొదలుపెట్టింది.
ఆయన పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కేసీఆర్ వల్లనే తాను రాజకీయాలలో ఈ స్థాయికి ఎదిగానని, కనుక పార్టీ వీడినా ఎప్పటికీ కేసీఆర్‌కి రుణపడి ఉంటానని సవినయంగా చెప్పారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ తనపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టడంతో ఆయన కూడా కేసీఆర్ గురించి ‘నోరు విప్పక’ తప్పలేదు.
తాను కేసీఆర్ వల్ల ఎమ్మెల్యే కాలేదని సొంత బలంతోనే ఎమ్మెల్యే అయ్యానన్నారు. కానీ తమ వంటి పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారన్నారు.
తామందరం కలిసి కేసీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసినప్పటికీ అయన ఏనాడూ తన వంటివారిని పట్టించుకాలేదని అన్నారు. దళితులంటే తనకు ఎంతో గౌరవమని చెప్పుకునే కేసీఆర్, తనకి మంత్రి పదవి ఇస్తారని అనుకుంటే, ఓ ఎమ్మెల్యేగా కూడా సముచిత గౌరవం ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలలో తనకి అవకాశం కల్పించలేదన్నారు,” గువ్వల బాలరాజు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తమతో ఇలాగే వ్యవహరించేవారని ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన పలువురు నేతలు చెప్పడం అందరూ విన్నారు. ఆ రెండు పార్టీలలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారి గొంతులు వినపడకపోవడానికి కారణం కూడా ఇదే.
కానీ నేటికీ జగన్, కేసీఆర్ ఇద్దరూ కూడా ప్రజలు తమ మొహాలు చూసే తమ నేతలకు ఓట్లు వేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారు. కాదని గువ్వల బాలరాజు చెపుతున్నారు.






