పండుగలు సంతోషం కలిగించాలి కానీ రాఖీ పండుగ మాత్రం ఇద్దరు ‘మోస్ట్ ఫేమస్ అన్న’లకు ఇబ్బందికరంగా మారాయి. వారే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకో అందరికీ తెలుసు. కనుక మళ్ళీ ఆ సోది ఇప్పుడొద్దు.
సొంత చెల్లెలితో రాఖీ కట్టించుకోలేక, కనీసం వారిని పలకరించలేని దుస్థితిలో ఉన్న వారిరువురూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలుపుతుండటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది కదా?ఇద్దరికీ ఇంట్లో ఈగల మోత మొగుతున్నా బయట పల్లకీల మోత యధావిధిగా సాగిపోతూనే ఉంది.
ముఖ్యంగా జగన్ అక్క చెల్లెమ్మలకు ‘రక్షా బంధన్ శుభాకాంక్షలు’ చెపుతున్న సమయంలోనే, వరుసకు సోదరి అయిన సునీతా రెడ్డి “పులివెందులలో అడుగుపెట్టాలంటే చాలా భయంగా ఉంది. సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. తనకు న్యాయం చేయాల్సిన జగన్, తనని, తన భర్తని నిందితులుగా కోర్టులో నిలబెట్టేందుకు ప్రయత్నించారని” సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ‘ఓన్ & ఒరిజినల్ చెల్లి’ షర్మిల కూడా మద్యం కుంభకోణం కేసులో మా అన్నని ఇంకా ఎప్పుడు లోపలేస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
జగన్-షర్మిల-సునీతల బంధాలు, కేసులతో పోలిస్తే కేటీఆర్-కవితల బంధం నేటికీ కాస్త మెరుగుగానే కనిపిస్తుంది. ఆమె అడపాదడపా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారే తప్ప షర్మిల, సునీతలాగ నేరుగా అన్నని పేరు పెట్టి విమర్శించడం లేదు.
కేటీఆర్ కూడా ఆమె విషయంలో చాలా హుందాగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ జాగృతితో ఆమె చేస్తున్న రాజకీయాలు, విమర్శలను కేటీఆర్ పట్టించుకోవడం లేదు.
ఎందుకంటే కేటీఆర్ నేటికీ తల్లి తండ్రుల మాట వింటున్నారు కనుకనే! కానీ జగన్‌కి అలాంటి తల్లి, చెల్లి సిల్లీ సెంటిమెంట్స్ లేవు. కనుక వారిపై వైసీపీ నేతలతో, సొంత మీడియా చేత విమర్శింపజేయడానికి వెనకాడరు.
ఇంట్లో వారితోనే అనుబంధం లేని ఇటువంటి నేతలు రాష్ట్రంలో అక్కలు, చెల్లెమ్మల సంక్షేమం కోసం ఆరాటపడుతున్నారంటే నమ్మశక్యంగా ఉంటుందా?






