అన్నలకు తప్పదు…చెల్లెళ్లకు గిట్టదు..!

Jagan, KTR vs Sharmila, Kavitha in Family Political Feud

అటు వైసీపీ లో ఇటు బిఆర్ఎస్ లో అన్నా చెల్లెళ్ళ మధ్య మొదలైన రాజకీయ పోరాటాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనితో ఇక్కడ వైఎస్ కుటుంబంలో అక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీలో సొంత కుటుంబ సభ్యులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు.

అయితే ఇక్కడ జగన్ అక్కడ కేటీఆర్ ఇద్దరు కూడా రాజకీయాల కోసం తమ సొంత రక్త సంబంధాలను సైతం తెంచుకోవడానికి సిద్ధమయ్యారు. అలాగే అటు షర్మిల ఇటు కవిత కూడా తమ తోడపుట్టిన వారితోనే రాజకీయ యుద్ధం చేయడాకి సై అంటున్నారు.

ADVERTISEMENT

అయితే ఇక్కడ షర్మిల, అన్న జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయ చేస్తుంటే అక్కడ చెల్లి కవిత కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించలేక సొంత కుంపటికి సన్నద్ధమయ్యారు. ఏపీలో ఎన్డీయే కు వ్యతిరేకంగా, వైసీపీ కి ప్రధమ ప్రత్యర్థిగా కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు షర్మిల.

అలాగే అటు కవిత కూడా కాంగ్రెస్ , బీజేపీ లకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు చెల్లిళ్లకు బీజేపీ అంటే గిట్టదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తానూ అరెస్టయ్యి జైలుకెళ్లడానికి ముఖ్యకారణం బీజేపీ రాజకీయమే అనేది కవిత వాదన.

కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు, బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేసుకునేందుకు బీజేపీ వేసిన రాజకీయ వ్యూహంలో భాగమే నా అరెస్టు అంటూ కవిత బీజేపీ తీరు పై భగ్గుమంటున్నారు. ఇక షర్మిల విషయానికొస్తే బీజేపీ కి ప్రధమ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పక్షాన షర్మిల రాజకీయ చేస్తుండడంతో షర్మిలకు బీజేపీ అంటే పడదు.

జగన్, మోడీ దత్తపుత్రుడని, వైసీపీ – బీజేపీ లు తెరవెనుక రాజకీయం నడుపుతారని, ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న బలమైన బంధమే వివేకా కేసు నిందితులను కాపాడుతుందంటూ షర్మిల ఇటు వైసీపీ పై అటు బీజేపీ పై నిప్పులు చెరుగుతారు. అయితే బీజేపీ అంటే ఈ ఇద్దరు చెల్లెళ్లకు తీవ్రమైన ఆక్రోశం కాగా..,

ఇక అన్నలు జగన్ కేటీఆర్ లకు బీజేపీ అంటే అమితమైన అభిమానం అనేది రాజకీయ వర్గాల నుంచి వినిపించే టాక్. గల్లీలో కుస్తీలు ఢిల్లీలో దోస్తీలు అనేలా ఇక్కడ జగన్ అక్కడ కేటీఆర్ బీజేపీ తో లోపాయకార రాజకీయాలు నడుపుతారు అనేది ఆయా ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు. అయితే వారి ఆరోపణలకు జగన్, కేటీఆర్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, బీజేపీ పై వారు అనుసరించే విధానాలు మరింత బలాన్ని చేకూరుస్తాయి.

జగన్ విషయానికొస్తే, ఎన్డీయే లో భాగమైన టీడీపీ, జనసేనలకు బద్ర శత్రువుగా ఉండే వైసీపీ బీజేపీ విషయంలో మాత్రం మిత్రబంధాన్ని పాటిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రవేశ పెట్టె అన్ని బిల్లులకు, బీజేపీ తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయానికి జగన్ బేషరతు మద్దతు ప్రకటిస్తారు.

నాడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఎంపిక నుంచి నేడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ నియామకం వరకు ఎన్డీయే లో భాగం కానీ వైసీపీ బీజేపీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించి బీజేపీ వీరవిధేయుడిగా జగన్ మరోసారి ఏపీ రాజకీయాలలో చర్చకొచ్చారు.

ఇక కేటీఆర్ సంగతి గమనిస్తే గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన మీద రేవంత్ సర్కార్ అనేక విచారణలకు ఆదేశాలిస్తూ ‘ఈ ఫార్ములా కేసు నుంచి ఫోన్ టాపింగ్ కేసు’ వరకు కేటీఆర్ టార్గెట్ గా అడుగులేసింది. అలాగే కాళేశ్వరం అవినీతి పై సీబీఐ విచారణ అంటూ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ కీలక నేత హరీష్ వరకు బిఆర్ఎస్ ను బీజేపీ వలయంలో పడేసింది.

దీనితో బీజేపీ పై దూకుడుగా రాజకీయం చేసేందుకు కేసీఆర్ తడబడుతున్నారు, అలాగే బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అంటూ మొదలైన రాజకీయం బిఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా బీజేపీ కి ఎదురెళ్లేందుకు సాహసించే పరిస్థితులలో లేరు. అందుచేతనే ఉప రాష్టప్రతి ఎన్నికలలో బిఆర్ఎస్ దూరం అంటూ బీజేపీ కి పరోక్ష సహకారం అందించారు.

ఈ విధంగా అన్నలిద్దరు జగన్, కేటీఆర్ లు తమ తమ రాజకీయ అవసరాల కోసం, వారి వారి రాజకీయ పార్టీల ఉనికి కోసం బీజేపీ కి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక చెల్లెళ్ళిద్దరు కవిత, షర్మిల విషయానికొస్తే బీజేపీ వారు తనను అరెస్టు చేశారే అన్న బాధ ఒకరిది కాగా, వారిని అరెస్టు చెయ్యలేదే అనే ఆక్రోశం మరొకరిది. ఇలా బీజేపీ విషయంలో ఆ అన్నల అభిమానం ఈ చెల్లెళ్ళ ఆక్రోశం తప్పదు – గిట్టదు అనేలా ఉంది.

ADVERTISEMENT
Latest Stories