జగనన్న దురాశ వల్ల 30 వేలమంది మృతి: షర్మిల

Jagan Liquor Scam: Sharmila Demands Answers

అవును. ఈ మాట చెప్పింది మరెవరో కాదు మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల. ఈరోజు గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె మద్యం కుంభకోణంకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావిస్తూ సమాధానం చెప్పాలని అన్నని నిలదీశారు.

“నేను అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే మద్యం కుంభకోణం ఎలా చేయాలో ప్లాన్ చేసి తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రతీదీ కనుసన్నలలో నడిపిస్తూ రూ. 3,500 కోట్లు కొల్లగొట్టారు.

ADVERTISEMENT

ఈ డిజిటల్ యుగంలో 5 ఏళ్ళపాటు రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలన్నీ నగదుతోనే జరిపించారు. ఎందుకు? అంటే ఆవిధంగా దోచుకునేందుకే.

అలా దోచుకోవాలనే బ్రాండెడ్ కంపెనీలను తప్పించేసి కల్తీ మద్యం, చవుక మద్యం తయారు చేసే కంపెనీలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారించారు.

ఆ కల్తీ మద్యం తాగి లక్షల మందికి కిడ్నీలు చెడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 మంది కిడ్నీ జబ్బులతో చనిపోయారు. ఈ కిడ్నీ జబ్బులు, మరణాల కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనుక వారందరూ జగన్‌ దురాశకు బలైన బాధితులే.

కనుక ఈ కల్తీ మద్యం విక్రయాలు, వాటి వలన పెరిగిన, చనిపోయిన కిడ్నీ రోగులు, వారి చికిత్స కోసం గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా జరిపిన చెల్లింపులపై కూడా సిట్ అధికారుల చేత లోతుగా విచారణ జరిపించి ఆ వివరాలను ప్రజల ముందు పెట్టాలని నేను సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను.

మద్యం కుంభకోణం జరగలేదని జగన్‌ వాదిస్తున్నారు కనుక ధైర్యంగా శాసనసభకు వెళ్ళి ఈ కేసులో సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న ప్రతీ అంశం, ప్రతీ లావాదేవీ గురించి నోరు విప్పి మాట్లాడాలి. వివరణ ఇవ్వాలి,” అని షర్మిల డిమాండ్ చేశారు.

ఇటీవలే డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ, జగన్‌ హయంలో ఆరోగ్యశ్రీ కేసులు శరవేగంగా పెరిగాయని క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు షర్మిల చెప్పిన ఈ వివరాలు దానిని విశదీకరిస్తున్నాయి.

జగన్‌ అమరావతి, పోలవరం, పరిశ్రమలకు చేసిన నష్టమే లక్షల కోట్లలో ఉంది. అది చాలదన్నట్లు ఈ అవినీతి అక్రమాలు చేయడం, వాటి కారణంగా ఇన్ని లక్షల మంది రోడ్డున పడటం, 30 వేలమంది చనిపోవడం చాలా బాధాకరం.

కనుక షర్మిల సూచించినట్లు ఈ కల్తీ మద్యం అమ్మకాలు, కిడ్నీ రోగులు, మరణాలు, చికిత్స ఖర్చులపై లోతుగా విచారణ జరిపించి నివేధిక బయటపెట్టడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories