జగన్ తప్పటడుగులు…వైసీపీ రాజకీయ తప్పిదాలేనా.?

Jagan Political Mistakes

2019 ఎన్నికలలో వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేతగా వైస్ జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఒక్కో తప్పటడుగు ఆ పార్టీకి రాజకీయ తప్పిదాలుగా మారుతున్నాయి. ముందుగా తన గెలుపులో, తన పార్టీ అధికారంలో భాగమైన తల్లి విజయలక్ష్మిని చెల్లి షర్మిలను జగన్ వైసీపీ కి దూరం చేయడం ఆయన వేసిన మొదటి తప్పటడుగనే చెప్పాలి.

వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా తల్లి విజయలక్ష్మిని తొలగించడం, ఆస్తి పంపకాల వివాదంతోనో, ఒక్క ఎంపీ సీట్ అంశంతోనే చెల్లి షర్మిలతో విభేదించడం, ఆమెను పార్టీ రాజకీయాలకు దూరం చేయడం జగన్ వేసిన తొలి తప్పటడుగు. అదే వైసీపీ రాజకీయ తప్పిదంగా మారింది. అందుకు వైసీపీ భారీ రాజకీయ మూల్యం కూడా చెల్లించింది.

ADVERTISEMENT

దాని ఫలితమే వైఎస్ఆర్ బ్రాండ్ ఇమేజ్ ని కోర్టుకెక్కించింది, కుటుంబ వివాదాలు రాజకీయ విబేధాలుగా మారేలా చేసింది. అలాగే సొంత బాబాయ్ వివేకా దారుణ హత్య వెనుక దాగున్న గుండెపోటు, నారసురా రక్త చరిత్ర ఒట్టి కట్టుకథలే అని సోదరి సునీత నుంచి ప్రకటనలు రావడం, ఆమెతో ఆమె కుటుంబంతో వైసీపీ విభేదించడం జగన్ వేసిన మరో తప్పటడుగు.

2019 ఎన్నికలకు ముందు వరకు వివేకా దారుణ హత్యను తన పార్టీ రాజకీయ లబ్ది కోసం ప్రచారం చేసుకున్న జగన్ ఒక్కసారి అధికారం చేతికి రాగానే బాధిత కుటుంబం పైనే హత్యారోపణలు చేయడం, వివేక వ్యక్తిగత జీవితం పై కథనాలు ప్రచారం చేయడం, అవినాష్ రెడ్డి కోసం సోదరి సునీత తో విభేదించడం జగన్ తప్పటడుగులలో మరొకటి.

ఈ తప్పటడుగు కూడా వైసీపీ ని రాజకీయంగా దెబ్బతీసింది. జగన్ వేసిన ఈ తప్పటడుగు ఇన్నాళ్లు రాజకీయ వేదికలెక్కని వివేకా భార్యను రాజకీయ వేదికలెక్కించింది, సునీత, షర్మిల ల బంధాన్ని బలపరిచింది. ఇవన్నీ ఒకపక్క ఉంటే మరోపక్క నుంచి రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రకటన చేయడం జగన్ వేసిన తప్పటడుగులలో ప్రముఖమైనది.

జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వైసీపీ ని రాజకీయంగా ప్రశ్నార్ధకంలో పడేసిందనే చెప్పాలి. నిలకడ లేని మాటలు, చిత్తసుద్ది లేని ప్రయత్నాలు, స్పష్టత లేని జగన్ ప్రకటనలు అన్ని కలిపి వైసీపీ ని రాజకీయంగా తప్పుదారి పట్టించాయి. ఇక వైసీపీ సోషల్ మీడియా నుంచి సాక్షి వరకు జగన్ తల్లి చెల్లి మీద అసభ్యకర వ్యాఖ్యలు, వాటిని సమర్ధించేలా జగన్ తీసుకున్న చర్యలు వైసీపీ రాజకీయ తప్పిదాలుగా మారాయి.

ఇక జగన్ వేసిన మరో అతిపెద్ద తప్పటడుగు చంద్రబాబు నాయుడు అరెస్టు, పవన్ నిర్బంధం. 2023 సెప్టెంబర్ 9 న అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్ వేసిన అతిపెద్ద తప్పటడుగు అనే చెప్పాలి. కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగా తనకొచ్చిన ఒక్క ఛాన్స్ ని ఈ నిర్ణయంతో జగన్ ఒక రకంగా దుర్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి.

ఒక పక్క బాబు అరెస్టు మరోపక్క అందుకు మద్దతిచ్చిన జనసేన అధినేత పవన్ నిర్బంధం వైసీపీ ని రాజకీయంగా పాతాళానికి నెట్టేసింది. ఆ ఒక్కరాత్రి ఏపీలో జరిగిన పరిణామాలు వైసీపీ రాజకీయ పునాదులను కుదిపేశాయి. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ని వై నాట్ 175 అన్న జగన్ నినాదాలను 11 కి పరిమితం చేసింది.

ఇక ఇప్పుడు తాజాగా అమరావతి కి దేశ పార్లమెంట్, రాజ్యసభలో చట్ట బద్ధత లభించిన శుభ సమయంలో జగన్ మీడియా ముందుకొచ్చి అమరావతి కాదు మావిగన్ అంటూ ప్రకటించడం జగన్ వేసిన మరోఅతిపెద్ద తప్పటడుగానే చెప్పాలి. ఈ తప్పటడుగు వైసీపీ ని రాజకీయంగా ఎంతవరకు ప్రభావితం చేయగలదో రానున్న రోజులలో తేలుతుంది.

ADVERTISEMENT
Latest Stories