
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న రాప్తాడు, పాపిరెడ్డిపల్లి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు స్థానిక వైసీపీ నేతలు ఎప్పటిలాగే భారీగా జనసమీకరణ చేసి జగన్‌కు జేజేలు పలికించారు. వారితో ఊరేగింపుగా మృతుడు లింగయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
జగన్‌కి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన ఆవేశంగా “నేను ముఖ్యమంత్రి కాగానే పోలీసుల బట్టలూడదీసి కొడతాను,” అని బెదిరించారు.
ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్ నోటి నుంచి అటువంటి మాటలు రావడం చూసి అందరూ షాక్ అయ్యారు. జగన్ తనని బెదిరించడంపై స్పందించిన రామగిరి ఎస్సై సుధాకర్, “ఇది మేము కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం.. ఊడదీసి పడేయడానికి ఇదేమీ అరటిపండు తొక్క కాదు పోలీస్ యూనిఫారం!” అంటూ ఘాటుగా బదులిచ్చారు.
రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం కూడా ఈరోజు విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టి జగన్ వ్యాఖ్యలను ఖండించింది. సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, “మేము ఎంతో ఒత్తిడి తట్టుకొని ఈ ఉద్యోగాలు చేస్తుంటాము. మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరించడం, బట్టలూడదీసి కొడతానని చులకన మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
Also Read – టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది
బట్టలూడదీసుకోవడానికి మేమేమైన ఫ్యాషన్ షో చేస్తున్నామా?పోలీస్ శాఖలో మహిళలు కూడా పనిచేస్తున్నారని జగన్‌కు తెలియదా?అంటే వారి పట్ల జగన్‌కు ఇంత చులకనభావం ఉందా? జగన్ తక్షణమే తన మాటలు వెనక్కు తీసుకొని బేషరతుగా పోలీసులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాము,” అని హెచ్చరించారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులపై ఒత్తిడి చేసి వారిలో కొందరి చేత చేయకూడని తప్పులు చేయించారు. జగన్ ఒత్తిడికి తలొగ్గి తప్పులు చేసినందుకు వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
జగన్ అధికారం కోల్పోయినా ఇంకా పోలీసులు తనని చూసి భయపడతారని, లేకుంటే భయపెట్టవచ్చని అనుకుంటున్నారు గనుకనే ఈవిదంగా మాట్లాడారు.
కానీ జగన్‌కి రామగిరి ఎస్సై సుధాకర్ చెంప దెబ్బ కొట్టిన్నట్లు జవాబు చెప్పారు. నోటికి వచ్చిన్నట్లు మాట్లాడినందుకు ఇప్పుడు జగన్ పోలీసులకు క్షమాపణలు చెప్పుకోవలసివస్తోంది లేకుంటే కోర్టులో మొట్టికాయలు తప్పవు.
ఆ దేవుడి ఆశీర్వాదాలు తనకున్నాయని జగన్ చెప్పుకుంటారు. కానీ ఆయన విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ వేరేగానే ఉంటుంది ఎందుకు?