జగన్‌ చెప్పింది నిజమే… మరెందుకు ఆలస్యం?

Jagan-Mohan-Reddy-Inorbit-Mall-Visakhapatnamఇవాళ్ళ విశాఖలో రహేజా గ్రూప్స్ రూ.600 కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే ఇనార్బిట్ మాల్‌కి సిఎం జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “దేవుడి దయతో విశాఖ నగరంలో ఆణిముత్యం వంటి ఈ ప్రాజెక్టుకి నేడు శంకుస్థాపన చేసుకొన్నాము.

ADVERTISEMENT

12-13 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌ ఇక్కడ నిర్మించబడుతోంది. దీని ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రెండో దశలో మరో రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐ‌టి స్పేస్, ఓ అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ కూడా రాబోతున్నాయి. అవి కూడా అందుబాటులోకి వస్తే మరో 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

ఈ ప్రాజెక్టుతో విశాఖ రూపు రేఖలే మారిపోతాయి. ఇంతకు ముందు ఆదానీ డాటా సెంటర్‌కి, ఐ‌టి స్పేస్‌కు, భోగాపురం విమానాశ్రయానికి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టుకి శంకుస్థాపనలు చేసుకొన్నాము. ఇవన్నీ పూర్తయితే ఉత్తరాంద్ర జిల్లాల రూపురేఖలే మారిపోతాయి,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

ఏ రాష్ట్రానికైనా పోర్టులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వస్తే అక్కడ వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయి. అందుకే హైదరాబాద్‌ ఇంత వేగంగా అభివృద్ధి సాధించగలిగింది. ఏపీ ప్రభుత్వం కూడా చొరవ చూపి ఉంటే రాష్ట్రంలో కూడా అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వచ్చి ఉండేవి. అప్పుడు సిఎం జగన్‌ చెప్పిన్నట్లుగా వేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించి ఉండేవి.

కానీ వైసీపీ పాలన మొదలైన తర్వాత నుంచే రాష్ట్రంలో పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి పారిపోతున్నాయి. యుద్ధప్రాతిపదికన అమరావతిని పూర్తిచేయవలసిన వైసీపీ ప్రభుత్వమే మూడు రాజధానులంటూ తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఉద్యమాలు చేయిస్తుండటంతో రాష్ట్రంలో ఈ అనిశ్చిత పరిస్థితులు చూసి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇదే అదునుగా తెలంగాణ రాష్ట్రం ఏపీలో ఈ దుస్తితిని చూపిస్తూ హైదరాబాద్‌లోనూ, తెలంగాణ అంతటా పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రప్పించుకొంటోంది. నిజానికి ఇనార్బిట్ మాల్ కంటే ముందు విశాఖలో యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ రూ.2200 కోట్ల పెట్టుబడితో భారీ హైపర్ మార్కెట్‌ నిర్మించేందుకు సిద్దపడితే దానిని పంపించేసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వమే కదా? దాంతో కూడా వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి వస్తాయని తెలియదా? దాంతో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలీదా? దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా భారీగా ఆదాయం వస్తుందని తెలీదా? అంటే అన్నీ తెలుసు. కానీ ఎందుకు తరిమికొట్టిన్నట్లు? అంటే కారణాలు అందరికీ తెలుసు.

ఆనాడు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులను ముట్టుకోకూడదని జగన్మోహన్ రెడ్డి అన్నిటినీ పక్కన పడేసినప్పటికీ, ఒకవేళ రేపు మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు జగన్‌ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో సహా అన్నిటినీ చంద్రబాబు నాయుడు తప్పకపూర్తిచేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత, రాజకీయ ద్వేషాలకు రాష్ట్రం, ప్రజలు నష్టపోకూడదని కోరుకొంటారు కనుక.

ADVERTISEMENT
Latest Stories