నాడు లోకేష్‌ విషయంలో చేసిన తప్పే… నేడు జగన్‌ విషయంలో

Jagan Mohan Reddy Nellore Visit

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు పర్యటనలో మరోసారి పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించి కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ‘బస్తీ మే సవాల్’ విసిరారు. నెల్లూరు వైసీపీ నేతలు పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా భారీగా వైసీపీ కార్యకర్తలను సమీకరించి దారి పొడవునా మొహరించారు.

జగన్‌ వెంట వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేస్తుంటే వారినీ, వారి హడావుడీ చూస్తూ జగన్‌ సంతోషంగా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నగరంలో సెంట్రల్ జైలుకి వెళ్ళే మార్గంలో వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్, ప్రభుత్వాసుపత్రి సెంటర్ వద్ద వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు.

ADVERTISEMENT

కానీ ఎటువంటి అవాంచనీయ ఘటనలకు పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైసీపీ శ్రేణులను అదుపు చేయడానికి కొన్ని చోట్ల స్వల్ప లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

జగన్‌ హెలికాఫ్టర్‌లో నెల్లూరు చేరుకొని అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా సెంట్రల్ జైలుకి వెళ్ళి క్వార్జ్ అక్రమ మైనింగ్, అక్రమ రవాణా కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిని కలిసి పరామర్శించారు. తర్వాత అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు.

జగన్‌ పరామర్శ యాత్రకు బయలుదేరిన ప్రతీసారీ ఈవిదంగా ‘బస్తీ మే సవాల్’ అంటూ అగ్నిపరీక్ష పెడుతుంటే, ప్రభుత్వం అయనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ జగన్‌ ఉచ్చులో పడుతోందని చెప్పక తప్పదు.

గతంలో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా ఇలాగే పోలీసులతో అడ్డుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. అప్పుడు నారా లోకేష్‌ వారిని గట్టిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుండేవారు. జగన్‌ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకున్నప్పుడు నారా లోకేష్‌లోని నాయకత్వ లక్షణాలను రాష్ట్ర ప్రజలందరూ చూడగలిగారు.

కనుక లోకేష్‌ని అడ్డుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలందరి దృష్టిని యువగళం పాదయాత్ర వైపు ఆకర్షించేలా తామే చేస్తున్నామని, ఆయనకు ఉచితంగా పబ్లిసిటీ చేస్తున్నామని జగన్‌ ప్రభుత్వం గ్రహించగానే ఆయనని అడ్డుకోవడం మానేసింది!

ఒకవేళ జగన్‌ ప్రభుత్వం యువగళం పూర్తయ్యేవరకు అడ్డుకొని ఉంటే ఖచ్చితంగా నారా లోకేష్‌ని జగన్‌ ప్రభుత్వమే గొప్ప రియల్ లైఫ్ హీరోని చేసి ఉండేది. కనుక అడ్డుకోవడం మానేసింది.

అప్పుడే ఈ విషయం గ్రహించిన జగన్‌ కూడా దానిని ఇప్పుడు పరామర్శ యాత్రలతో ఆచరణలో పెట్టి అటువంటి ఫలితమే పొందాలని ఆశ పడుతున్నారు.

కనుక కూటమి ప్రభుత్వం ఆయన పర్యటనలకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తూ ప్రజల దృష్టిలో జగన్‌ని మళ్ళీ హీరోని చేస్తోందని చెప్పక తప్పదు.

అయినా ఎన్ని ఆంక్షలు విధించినా జగన్‌ని, వైసీపీ కార్యకర్తలని పోలీసులు అడ్డుకోగలుగుతున్నారా? లేదు కదా? పైగా పోలీసుల దౌర్జన్యం, అప్రజాస్వామికం, జగన్‌ జనాధరణ చూసి సిఎం చంద్రబాబు నాయుడుకి చమటలు పడుతున్నాయంటూ వాదించే అవకాశం కల్పిస్తోంది కదా?

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు లేకుంటే సౌండ్ రాదు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా జగన్‌ పరామర్శ యాత్రలను పట్టించుకోకుండా వదిలేస్తే ఇంత హడావుడి ఉండదు. చేయలేరు. చేసినా ప్రయోజనం ఉండదు కదా?

ADVERTISEMENT
Latest Stories