వివేకా హత్య – వైఎస్ మరణం…జగన్ కు ఆ నైతికత ఉందా.?

Jagan Mohan Reddy Press Meet

జగన్ నిర్వహించే ప్రెస్ మీట్లు ప్రజలకు ఎంతగా ఉపయోగపడతాయో.? అధికార పార్టీలను ఎంతలా భయపడతాయో.? చెప్పలేం కానీ ఇటు సోషల్ మీడియా మీమర్స్ కి మాత్రం మంచి కంటెంట్ ని అందిస్తాయి, అలాగే అవి చూస్తున్న ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి.

అయితే తాజాగా నేడు తాడేపల్లి ప్యాలస్ లో జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్లలోని కొన్ని అంశాలు మరొకసారి వైసీపీ ని ఇరుకునపెట్టేలా, జగన్ పైనే వేలెత్తి చూపేలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా జగన్ బాబాయ్ వివేకా దారుణ హత్య ఘటన పై జగన్ ఇప్పటికి బాబు పైనే నిందలు వేస్తున్నారు, టీడీపీ ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తున్నారు.

ADVERTISEMENT

టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వివేకా గొడ్డలి వేటుకు గురయ్యారని, అయితే ఆ పాపం బాబుదే అనేలా జగన్ తన ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి రెండు రోజుల ముందు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా’ అన్నాడని, అలా అన్న రెండు రోజులకే వైఎస్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయారని పరోక్షంగా బాబు పై విమర్శలు గుప్పించారు.

ఇక వంగవీటి మోహన రంగా హత్య సమయంలో కూడా టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉందని, అప్పుడు సీఎం గా ఉన్న బాబే ఆ హత్యకు బాధ్యత వహించాలని, ఆ హత్యకు సంబంధించిన వేళ్లన్ని బాబు వైపు చూపిస్తున్నాయంటూ బాబు చేతికి రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు జగన్, అలాగే టీడీపీ పార్టీకి హత్య రాజకీయాలు అనే టాగ్ లైన్ అతికించాలని ఆశపడుతున్నారు.

అయితే ఈ మూడు మరణాల గురించి కాస్త లోతుగా విశ్లేషణ చేస్తే, ముందుగా వివేకా హత్య గురించి, వివేకా గొడ్డలి పోటును గుండె పాటుగా చిత్రీకరించిన సాక్షి నుంచి కథ మొదలుపెడితే, నారావారి రక్త చరిత్ర అంటూ కథను మలుపుతిప్పిన జగన్, వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ట్విస్ట్ తో సైలెంట్ అయిపోయారు.

వివేకా హత్య జరిగిన తరువాత ఐదేళ్లు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనే ఉంది, ముఖ్యమంత్రిగా జగన్ హిట్లర్ పాలన సాగింది, ఇక వివేకా సతీమణి నుంచి ఆయన కుమార్తె సునీత వరకు తమ తండ్రి దారుణ హత్యలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర కీలకం అంటూ న్యాయపోరాటాలు చేస్తున్నారు.

గత ఏడెనిమిదేళ్లు గా సునీత తన తండ్రి మరణానికి న్యాయం కావాలి అంటూ కాళ్లరిగేలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, నోరు పోయేలా మీడియాలో తన వాదన వినిపిస్తున్నారు. అయినా కూడా నాటి సీఎం గా ఉన్న జగన్ అవినాష్ కి వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వెయ్యలేదు సరికదా అవినాష్ కోసం వచ్చిన సిబిఐ అధికారులను సైతం తన అధికార బలం తో అడ్డుకుని అవినాష్ రెడ్డి కి కాపు కాసారు, ఇప్పటికి కాస్తున్నారు కూడా.

ఇక వంగవీటి రంగా హత్య గురించి ప్రస్తావిస్తే అసలు విజయవాడలో వంగవీటి vs దేవినేని అంటూ సాగిన హత్యా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనంగా మారిన విషయం జగమెరిగిన సత్యమే. రంగా హత్య విషయంలో ఆయన వర్గం వారు వేలెత్తి చూపే దేవినేని కుటుంబం ఇప్పుడు వైసీపీ రాజకీయ గొడుగు కింద సేద తీరుతుంది.

వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ ను కాదని జగన్ రంగా వర్గానికి అత్యంత రాజకీయ ప్రత్యర్దులలైనా దేవినేని అవినాష్ కి స్థానం కల్పించారు. ఈ అవమాన భారంతోనే రాధ వైసీపీ ని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. నిజంగా రంగా హత్యలో బాబు పాత్ర ఉంటే ఆయన తనయుడు రాధా, బాబు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దపడతారా.?

ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదం గురించి ఆయన మరణం గురించి మాట్లాడుకుంటే నాడు వైఎస్ మరణం వెనుక రిలయన్స్ వారి ప్రమేయం ఉందని, వారి పై తీవ్రమైన విమర్శలు చేసిన జగన్ చివరికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రిలయన్స్ కు సంబంధించిన వ్యక్తికే ఏపీ తరుపున రాజ్యసభ సీటును కేటాయించిన సంగతి జగన్ మరిచారా.?

జగన్ తీసుకున్న ఈ ఒక్క రాజకీయ నిర్ణయం వైఎస్ అభిమానులను, వైసీపీ మద్దతుదారులను కూడా మానసిక క్షోభకు గురి చేసిన మాట వాస్తవం కాదా.? నాడు రిలయన్స్ కు వ్యతిరేకంగా జగన్ మాటలు నమ్మి, సాక్షి కథనాలు విన్న వైఎస్ అభిమానులు రాష్ట్రంలో పలు రిలయన్స్ సంస్థల వ్యాపార సముదాయాల మీద దాడులతో రెచ్చిపోయారు.

కానీ చివరికి అదే రిలయన్స్ వారికీ వైసీపీ రాజకీయ కాపు కాసింది. అలాంటి జగన్ ఇప్పుడు వైఎస్ మరణం గుంరించి బాబు వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తే వాటిని నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు కానీ వైసీపీ క్యాడర్ కానీ సిద్ధంగా ఉంటారా.? జగన్ తన ప్రెస్ మీట్ లో చెప్పిన ఈ ముగ్గురి మరణాల వెనుక అసలు వాస్తవాలు రాజకీయ పార్టీ నేతల ప్రకటనలతో ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ ముందుకు వెళుతున్నాయే తప్ప ముగింపు రావడం లేదు.

ADVERTISEMENT
Latest Stories