Jagan Mohan Reddy Speech in YSR Congress Party Origin Day

వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో పార్టీ జెండా ఎగురవేసి, సిఎం చంద్రబాబు నాయుడు తనలాగ సంక్షేమ పధకాలు అమలుచేయలేక, ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారని, కనుక ప్రజలు తన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకున్నారు.

వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు. అంతవరకు పార్టీలో ప్రతీ ఒక్కరూ రాష్ట్రంలో అభాగ్యులకు అండగా నిలబడి పోరాడాలని హితవు పలికారు.

Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!

జగన్‌ ఎంతో శ్రమించి వైసీపీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శ్రమని, దాని వలన లభించిన గొప్ప అవకాశం విలువని గుర్తించలేక తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు పాలన సాగించి ప్రజల చేత తిరస్కరించబడ్డారు.

ఓ రాజకీయ పార్టీ గెలుపోటములకు అనేక కారణాలుంటాయి. అనేక సమీకరణాలు కుదరాలి. అన్ని శక్తులు కలిసి రావాలి. వైసీపీకి, టీడీపీ కూటమి ఆవిదంగానే గెలిచాయి. ఆవిదంగానే ఓడిపోయాయి.

Also Read – అమరావతి ‘పట్టాభిషేకం’…వైసీపీ ‘అరణ్యవాసం’..!

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పధకాలు అమలుచేశారు. కనుక 175కి 175 సీట్లు వస్తాయని చెప్పుకునేవారు. కానీ రాలేదు. అది అప్రస్తుతం.

అదేవిదంగా 2029 ఎన్నికలలో వైసీపీ తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెపుతున్నప్పుడు, జగన్‌ దానికి బలమైన కారణాలు చెపాల్సి ఉంటుంది.

Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!

ఉదాహరణకు ఆయన కోరుకున్నట్లు కూటమిలో పార్టీలు విడిపోతాయా?లేదా కూటమి ఓడిపోయేందుకు ఏమైనా బలమైన రాజకీయ పరిణామాలు జరుగుతాయని భావిస్తున్నారా?జగన్‌ చెప్పాల్సి ఉంటుంది.

కూటమిలో మూడు పార్టీల సఖ్యత, పదవుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు వంటివన్నీ కూటమిలో పరిపక్వతకి అద్దం పడుతున్నాయి. ఇదేవిదంగా మిగిలిన నాలుగేళ్ళు అవి కలిసికట్టుగా ముందుకు సాగితే రాబోయే ఎన్నికల నాటికి వాటి బంధం మరింత బలపడుతుంది.

టీడీపీ పాలన ఏవిదంగా సాగుతుందో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు జనసేన కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉంటున్నందున, దాని పట్ల కూడా వివిద సామాజిక వర్గాలలో నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగిపోతాయి. ఇది జనసేన సానుకూలంగా మారుతుంది. కనుక వచ్చే ఎన్నికల నాటికి కూటమి మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

కూటమిలో పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారనే విషయం రహాస్యమేమీ కాదు. కనుక దాని కోసం టీడీపీ, జనసేనలు కలహించుకొని విడిపోతే తమకు అవకాశం లభిస్తుందని జగన్‌ ఆశపడుతున్నారు.

ఈ విషయం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు కూడా బాగా తెలుసు. ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకుని విడిపోతే అందరం నష్టపోతామని, జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తమ పార్టీలు మనుగడ సాగించడం కూడా కష్టమవుతుందని వారికీ బాగా తెలుసు. కనుక ముఖ్యమంత్రి పదవి సమస్యని తప్పకుండా సామరస్యంగా పరిష్కరించుకోగలరు.

ఇక వైసీపీ విషయానికి వస్తే, 2024 ఎన్నికల సమయంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కూటమిని ఎదుర్కోలేక చతికిలపడ్డారు. రాబోయే నాలుగేళ్ళలో కూటమి మరింత బలపడినప్పుడు, ఈ నాలుగేళ్ళలో జగన్‌తో సహా వైసీపీలో పలువురు నేతలు ఏదో ఓ కేసులో జైళ్ళకు వెళ్ళడం వలన పార్టీ మరింత బలహీనపడినప్పుడు, ఏవిదంగా 2029 ఎన్నికలలో వైసీపీ గెలవగలదో జగన్‌ చెప్పగలిగితే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు కూడా ఆయన మాటలపై నమ్మకం కలుగుతుంది.

కానీ వైసీపీ ఏవిదంగా 2029 ఎన్నికలలో గెలవగలదో, అందుకోసం తాను ఏమి చేయాలో జగన్‌కి కూడా తెలీదు. కనుక ‘175/175’ పాటతో 5 ఏళ్ళ పాటు అందరినీ మభ్యపెట్టినట్లే, ఇప్పుడు ‘మళ్ళీ మనమే’ అనే కొత్త పాటతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.