శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోటా వినూత దంపతులను కారు డ్రైవర్ హత్య కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారు డ్రైవర్ శ్రీనివాసులుని హత్య చేసి తమ అనుచరుల సాయంతో మృతదేహాన్ని చెన్నైలోని కూవం నది కాలువలో పడేసినట్లు చెన్నై పోలీసులు కనుగొని వారిరువురినీ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన సోషల్ మీడియాలో ప్రకటించింది. అటువంటి వారికి జనసేన పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేసింది.
జనసేన ఇన్‌ఛార్జ్ ఈ కేసులో అరెస్ట్ అవడంపై వైసీపీ వ్యంగ్యంగా స్పందిస్తూ, ఇలాంటివారిని పక్కన పెట్టుకొని నీతులు చెపుతున్నావా?అంటూ కోటా వినూత దంపతులతో పవన్ కళ్యాణ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ని రోజులకు జనసేన తమ చేతికి చిక్కిందనే ఉత్సాహంలో తమ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంత బాబు సంగతి మరిచిపోయింది. వైసీపీ మారిచిపోయినా జనసేన మారిచిపోలేదు.
కనుక జనసేన కూడా ధీటుగా స్పందిస్తూ ‘బాబాయ్ ని లేపేసిన ఎంపీ అవినాష్ రెడ్డిని, కాకినాడలో దళిత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంత బాబు ఇద్దరినీ పక్కనే పెట్టుకొని కాపాడుతూ, మా పార్టీపై రాళ్ళు వేస్తారా? మా పార్టీ నేతలపై కేసు నమోదవగానే వెంటనే సస్పెండ్ చేశాము. మీకు ధైర్యం ఉంటే ముందు వాళ్ళిద్దరిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి,” అని కౌంటర్ వేశారు. నిజమే కదా?




