చివరకు ఆ 11 అయినా ఉంటాయా..?

Jagan Mohan Reddy YSRCP 11 Leaders

నొక్కిన బటన్లు…తొక్కిన గడపలు…వచ్చిన వాలంటీర్లు…తెచ్చిన గ్రామ సచివాలయాలు …పంచిన నవరత్నాలు…పెట్టిన మూడు రాజధానులు… నియమించిన సలహాదారులు… అర్ధం లేని నినాదాలు…అవసరం లేని విమర్శలు…ఆదాయానికి మించిన అప్పులు…అప్పుకి మించిన తాకట్లు ఇలా ఐదేళ్ల వైసీపీ పాలనను 11 విధానాలలో క్లుప్తంగా వివరించవచ్చు.

నేను నొక్కిన బట్లన్నీ ఎవరి ఖాతాలో ఓట్లయ్యాయో.? మా నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ తొక్కిన గడపలన్నీ ఏ పార్టీ గుమ్మానికి పసుపులద్దాయో.? నేను ఏర్పాటు చేసిన వాలంటరీ సామ్రాజ్యం ఏ పార్టీ జెండా కు బలంగా మారిందో.? వందలమంది సలహాదారుల సలహాలన్నీ ఎటుపోయాయో.? అంటూ నేటికీ వైస్ జగన్ తన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి గెలుపుని అంగీకరించలేకపోతున్నారు.

ADVERTISEMENT

తెచ్చిన అప్పులు…పంచిన పథకాలు, చేసిన విమర్శలు, ఇచ్చిన నినాదాలు ఇలా జగన్ అనుసరించిన ఏ ఒక్క రాజకీయ విధానం కూడా వైసీపీ కి మరో ఛాన్స్ తీసుకురాలేకపోయింది అనే వాస్తవాన్ని జగన్ ఇప్పటికి గ్రహించలేకపోతున్నారు. అంతే కాదు వైసీపీ హయాంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం, మూడు పార్టీల అధినేతల మీద చేసిన (బాబు, పవన్, పురందరేశ్వరి) నిర్బంధం టీడీపీ, జనసేన, బీజేపీ ల కూటమికి బాటలు వేసింది, బలం చేకూర్చింది.

ఇలా జగన్ తీసుకున్న అన్నినిర్ణయాలు వైసీపీ ని రాజకీయంగా దెబ్బతీశాయి. అధికారంలో ఉన్నప్పుడు అలా…తన ఒంటెద్దుపోకడలతో కనీసం పార్టీ నాయకుల అభిప్రాయాలకు కూడా విలువనివ్వకుండా జగన్ అనుసరించిన విధానాలతో నేడు వైసీపీ 11 సీట్లకు పరిమితమయ్యింది.

అయితే నేడు అధికారానికి దూరమైనప్పటికీ జగన్ తన పంధాలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోకుండా అదే నియంత ధోరణితో పార్టీలో ఉన్న ఆ 11 మంది నాయకులను కూడా దూరం చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లలో మరికొంతమంది మంచి ముహూర్తం చూసుకుని కండువాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనితో వైసీపీ కి చివరికి ఆ 11 కూడా ఉంటాయా అన్న అనుమానాలు పార్టీ క్యాడర్ ను వేధిస్తున్నాయి. అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా గళం వినిపిస్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు కూడా త్వరలోనే వైసీపీ కి గుడ్ బై చెప్పి కూటమితో జతకట్టబోతున్నారు అనే వార్తలు కూడా వైసీపీ శ్రేణులను కలవర పరుస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి కూడా జగన్ విధానాల పై రాజకీయ విమర్శలు చేస్తూ వైసీపీ కి దండం పెట్టి రాజకీయాల నుండి తప్పుకున్నారు.

ఇక తల్లి, చెల్లి ఏనాడో జగన్ కు దూరంగా జరిగిపోయారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని వంటి వైసీపీ వీర విధేయులు కూడా వైసీపీ ని వదిలి టీడీపీ, జనసేన గూటికి చేరిపోయారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ లలో ఇప్పటికే ఐదుగురు సభ్యులు పార్టీకి రాజీనామా చేసారు. అలాగే వైసీపీ రాజ్యసభ సభ్యులలో విజయసాయి, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు వంటి నేతలు రాజీనామాలతో జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు.

ఇలా వైసీపీ నుండి ఒక్కో నేత రాజీనామా తో బయటకు వచ్చేస్తుంటే ఇక వైసీపీలో మిగిలేదెవరు.? జగన్ వెంట నడిచేదెవరు.? సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాధ్, పెద్ది రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి….వంటి నేతలు మాత్రమే వైసీపీ లో చెలరేగే రాజకీయ మంటలలో చలి కాచుకోనున్నారా.? అన్న వాదన కూడా వినిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories