వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. పార్టీ నాయకులను ముందుండి నడిపించాల్సిన అయన, బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని ఏపీలో మొంథా తుఫాను బాధితులకు సాయపడాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆయన అదృష్టమేమిటంటే పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తున్నప్పటికీ నేటికీ పార్టీ శ్రేణులు ఆయన గీసిన గీత దాటవు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తారు. 175కి 175మనవేనంటే నమ్మారు. ఇప్పుడు కూడా ‘మళ్ళీ మనమే’ అంటే నమ్ముతూనే ఉన్నారు. ఇలాంటి పార్టీ శ్రేణులు కలిగి ఉండటం అయన అదృష్టమే కదా?
ఆయన పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు తుఫాను బాధితులను పరామర్శించి యధాశక్తిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అధినేత లేని లోటుని మరపిస్తున్నారు.
ముందే చెప్పుకున్నట్లు తుఫానుకు ముందు లేదా తుఫాను సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పడం కంటే తుఫాను వలన తీవ్రంగా నష్టపోయి, బాధపడుతున్నవారిని ఓదార్చడం వలననే ఎక్కువ రాజకీయ మైలేజ్ లభిస్తుంది.
బహుశః అందుకేనేమో నేడు జగన్ బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఆయనకి జై జగన్, జైజై జగన్ నినాదాలతో స్వాగతం మామూలే.
నేడు తాడేపల్లి ప్యాలస్ పార్టీ నేతలతో తాజా పరిస్థితిని సమీక్షించిన తర్వాత ముందుగా ప్రెస్‌మీట్ పెట్టి ‘తుఫాను బాధితులను ఆదుకోవడంలో సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ తేల్చి చెప్పేస్తారు.
ఆ తర్వాత పార్టీ నేతల ఫీడ్ బ్యాక్ బట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను పరామర్శించేందుకు బయలుదేరవచ్చు.
ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను వలన దెబ్బ తిన్న పంటలను చూసేందుకు పొలం పక్కన రోడ్డుపై టెంట్, దానిలో కార్పెట్ పరిపించుకుని ఫోటో సెషన్ పూర్తి చేశారు. కానీ ఈసారి అలా చేయకూడదు. కనుక కాస్త ఇబ్బందిగా అనిపించినా బురద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిలబడి ఫోటో సెషన్ పూర్తి చేయక తప్పదు.
తర్వాత బాధిత కుటుంబాల వద్దకు వెళ్ళి “అదే… నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటేనా…. అంటూ మొదలుపెట్టి సిఎం చంద్రబాబు నాయుడు పాలన ఎంత దరిద్రంగా ఉందో విమర్శించడంతో పరామర్శ ముగిస్తారు. త్వరలోనే పరామర్శకు ముహూర్తం ప్రకటించవచ్చు.






