ఏపీ రాజకీయాలలో వైస్ కుటుంబం రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. 2019 ఎన్నికలలో అన్న గెలుపు కోసం ప్రచారం చేసిన చెల్లి 2024 లో అన్న ఓటమి కోసం కంకణం కట్టింది.
ఈ ఐదేళ్ల నిర్దిష్ట కాలపరిమితిలో ఒకే కుటుంబంలో అన్నా చెల్లుళ్ళుగా ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు రాజకీయ ప్రత్యర్థులుగా కథం తొక్కారు. అయితే ఇక్కడ అన్న జగన్ గెలిచి ఓడితే చెల్లి షర్మిల ఓడి గెలిచారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎన్నికల తరువాత పులివెందుల ఎమ్మెల్యే గా తగ్గి, జగన్ గద్దె దిగాలి, వైసీపీ ప్రభుత్వం నేలరాలాలి అన్న చెల్లి ఆశయాన్ని గెలిపించారు.
అయితే 151 నుంచి 11 సీట్లకు పతనమైన వైసీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాను, అందుకు అవసరమైతే మళ్ళీ పాదయాత్ర చేస్తాను, కూటమి ప్రభుత్వంతో పోరాట యాత్రకు దిగుతాను, ఆ దేవుని దయ, కేంద్ర ప్రభుత్వ చల్లని చూపు కలిసి వస్తే జమిలి ఎన్నికల రూపంలో ఏపీలో 2027 లోనే ఎన్నికలు జరిగే అవకాశం వస్తుంది.
కావునా వైసీపీ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంటుంది, ఆ పైన మా ప్రభుత్వం ఈ కూటమి పార్టీల నేతల అంతు తెల్చబోతుంది అంటూ పగటి కలలు కంటూ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి తానూ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆకాశంలో తేలుతున్నారు. అయితే జగన్ ఎప్పుడు కూడా ప్రజా క్షేత్రానికి దూరంగా అంచనాలు వేసి విఫలమవుతుంటారనేది నాటి ఎన్నికల ఫలితాలతో సుస్పష్టమయ్యింది.
వై నాట్ 175 , ప్రజలంతా వైసీపీ పార్టీతోనే ఉన్నారు అంటూ వాస్తవ పరిస్థితులను అవగాహనా చేసుకోకుండా ఒక ఊహ లోకంలో ఊరేగారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో రాబోయేది మా ప్రభుత్వమే అంటూ ఆలోచనలు చేస్తూ కనీసం ఈ ఐదేళ్లల్లో పార్టీని ఎలా బలపరుచుకోవాలో అనే ప్రణాళికలు చేయకుండా మేము ఇంకా బలంగానే ఉన్నాం, మిమ్మల్ని బలహీన పరుస్తాం అంటూ మొండి వాదన ఆడుతూ ఊహాలోకంలో విహరిస్తున్నారు.
ఇక చెల్లి షర్మిల విషయానికి వస్తే, ఆమె రాజకీయం అరణ్యంలో ఆకలి కేకలు మాదిరే కొనసాగుతున్నాయి. అన్న ను ఓడించడమే లక్ష్యంతో ఏపీలో చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ జీవితానికి క్వషన్ మార్క్ పెట్టుకున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్య చిత్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఎక్కడ అంటే చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడా పార్టీని నమ్మి, ఆ పార్టీ నాయకత్వం వెంట నడిచే నాయకులే కాదు ప్రజలు లేరన్న సత్యాన్ని షర్మిల గ్రహించలేకపోతున్నారు.
ఇటువంటి సందర్భంలో ఏపీలో షర్మిల రాజకీయ ప్రయాణం ఒక అరణ్య రోధననే చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని భర్తీ చేసే పనిలో పడింది జనసేన. ఇక బీజేపీ కి టీడీపీ, జనసేన అండ ఉన్నంత కాలం దాని పరిమిత స్థానం ఏపీలో పదిలం. ఇక రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ తన బలాన్ని నిలబెట్టుకునే పనిలో ఉంది. ఇంత రాజకీయ పోటీలను తట్టుకుని మరి కాంగ్రెస్ ఏపీలో తిరిగి పుంజుకోగలదా.? అంటే ఆ ప్రశ్నకు సమాధానం చెల్లి షర్మిలకు కూడా తెలుసు.
ఇలా ఈ అన్నా- చెల్లి ఇద్దరు కూడా ఏపీలో తమ రాజకీయ ప్రయాణంలో ఒకరు రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నేను అంటూ ‘ఆకాశంలో విహరిస్తుంటే’, మరొకరు రాష్ట్ర ప్రజలకు దూరంగా ఉన్న ‘అరణ్యం’ లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉనికి కోసం పోరాడుతున్నారు. మరి వీరి ఈ ఆకాశ విహారాలకు, అరణ్య రోధనలకు ఏపీ ప్రజలు కరుగుతారా.?




