2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి తరహాలోనే 2024 పోలింగ్ కు ముందు ఏప్రిల్ 13వ తేదీన జగన్ మోహన్ రెడ్డిపై అనూహ్యంగా గులకరాయి దాడి జరిగి, అది ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్న సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ నేడు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. శని, ఆదివారాలు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలని, 50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న సతీష్, ఈ ఉత్తర్వులు జైలు అధికారులకు సమర్పించిన పిదప, జైలు నుండి విడుదల కానున్నాడు. దాదాపుగా నెలన్నర్ర రోజుల వ్యవధిలోనే గులకరాయి దాడి నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరు కావడం గమనించదగ్గ అంశం.
కోడి కత్తి శ్రీను విషయంలో శ్రీను కుటుంబ సభ్యులు ఐదేళ్లు న్యాయ పోరాటం చేసిన పిదప దక్కిన బైలు సతీష్ కు నెలన్నర రోజులలో రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఐదేళ్ల తరువాత బైలు మీద బయటకు వచ్చిన శ్రీను వైసీపీ కి వ్యతిరేకంగా జగన్ ను తప్పుబడుతూ ప్రకటనలు చేసారు. మరి గులకరాయి సతీష్ బైలు తరువాత ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న ఆసక్తి అందరిలో మొదలయ్యింది.
2019లో నమోదైన కేసు తర్వాత ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. మరి నేడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని ఈ గులకరాయి కేసు ఏ విధంగా నిలబెడుతుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచిచూడాలి.




