వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాప్తాడు పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రి అయితే పోలీస్ అధికారుల బట్టలూడదీసి కొడతాను. రామగిరి ఎస్సై సుధాకర్ తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు,” అంటూ ఇంకా పోలీసులను కించపరుస్తూ చాలా మాట్లాడారు.
జగన్ అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులకు రామగిరి ఎస్సై సుధాకర్ వెంటనే ఘాటుగా బదులిచ్చారు. జగన్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. దానిలో ఆయన పోలీస్ యూనిఫారం ధరించి ఉన్నారు.
ఎస్సై సుధాకర్ ఏమన్నారంటే, “జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతానన్నావు. మేమేమైన నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు కావివి. ఎంతో కష్టపడి చదివి, వేలమందితో పోటీపడి పరీక్షలు వ్రాసి ఈ పోలీస్ ఉద్యోగాలు సంపాదించుకున్నాము. నువ్వు వచ్చి మా బట్ట లూడదీస్తానంటే ఇదేమి అరటి పండు తొక్క కాదు. పోలీస్ యూనిఫారం.
మేము నిజాయితీగా ప్రజల కోసమే పనిచేస్తాము. నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డమైన దారులు తొక్కం. కనుక పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు,” అని సూటిగా హెచ్చరించారు.
ఓ మాజీ ముఖ్యమంత్రి పోలీస్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తూ ఈవిదంగా చులకనగా, బెదిరిస్తూ మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి అనితా వంగలపూడి, పోలీస్ అధికారులు ఎవరూ స్పందించకపోవడం చాలా శోచనీయం. బహుశః జగన్ వ్యాఖ్యలపై చట్టప్రకారం ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారేమో తెలీదు. కానీ శాంతి భద్రతలను కాపాడే పోలీసులకే భద్రత లేకపోతే, ఈవిదంగా రాజకీయ నాయకులు బహిరంగంగానే వారిని బెదిరిస్తుంటే ఇక వారు ధైర్యంగా ఎలా పని చేయగలరు?కనుక పోలీసులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.




