మనిషి డీఎన్ఏ ఎన్నటికీ మారదు. కనుక వైసీపీ అధినేత జగన్ పదవీ, అధికారం కోల్పోయినా ఆయన మాటలు, చేతలు మారలేదు.
త్వరలో ఓ మొబైల్ యాప్ కార్యకర్తలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వారు తమని వేదిస్తున్న అధికారుల పేర్లు, వివరాలు దానిలో పంపిస్తే, వాటిని తమ డేటా బేస్ లైబ్రేరీలో భద్రపరిచి ఉంచుతామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ డేటాబేస్‌లో ఉన్న ప్రతీ అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధికారంలో ఉన్నవారికి అధికారులు ఎలాగూ విధేయంగా పని చేయక తప్పదు. వారి ఆదేశాలు అమలు చేయక తప్పదు.
కానీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్, ప్రతిపక్షంలోకి మారిన తర్వాత కూడా ఈవిదంగా మాట్లాడుతూ అధికారులను బెదిరిస్తుంటే, వారు ఏవిదంగా నిర్భయంగా పని చేయగలరు?ఇటువంటి భయాలతో అధికారులు సమర్ధంగా పనిచేయకపోతే ప్రభుత్వాలు ఏవిదంగా పనిచేయగలవు?
ఇంతకీ జగన్ తన పార్టీ నేతలు, కార్యకర్తల గురించి దిగులు చెందుతున్నారా లేదా ఈ మొబైల్ యాప్ పేరుతో ప్రభుత్వాధికారులను భయపడేలా చేస్తూ తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వాన్ని శాశించాలనుకుంటున్నారా? అనే సందేహం కలుగక మానదు.
ఇప్పటికే రాజకీయాలు చాలా దిగజారిపోయాయి. జగన్ ఈవిదంగా వ్యవహరిస్తూ వ్యవస్థలు పనిచేయకుండా చేస్తే అది రాష్ట్రానికే చాలా హానికరంగా మారవచ్చు.
కనుక ఇటువంటి బెదిరింపులకు అధికారులు ప్రభావితం కాకుండా, ధైర్యంగా వారి పని వారు చేసుకునేందుకు, ప్రభుత్వాలు మారినా వారి భద్రతకు భరోసా కల్పించడానికి ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.






