రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. రఘురామ కృష్ణరాజు తనని వ్యతిరేకించారనే కక్షతో సొంత ఎంపీ అని కూడా చూడకుండా జగన్ ఆయనపై రాజద్రోహం నేరం కేసు నమోదు చేయించి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టించారు. ఆ భయంతో ఆయన దాదాపు 3-4 ఏళ్ళు ఢిల్లీలోనే బ్రతకాల్సివచ్చింది.
ఓ ముఖ్యమంత్రి ఓ ఎంపీని చిత్రహింసలు పెడితే కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఎందుకు స్పందించలేదో తెలియదు కానీ ఆయనకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. ‘ఆనాడు చంద్రబాబు నాయుడే అడ్డుపడకపోయి ఉంటే విచారణ పేరుతో జరిగిన చిత్రహింసలతో తన ప్రాణాలు పోయేవే’ అని రఘురామ కృష్ణరాజు స్వయంగా చెప్పారు.
జగన్ హయంలో ఆయన ఏపీలో తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో అడుగుపెట్టలేకపోయారు. కానీ అదే రఘురామ కృష్ణరాజుని టిడిపిలో చేర్చుకొని ‘ఉండి’ ఎమ్మెల్యేగా చేశారు చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు ఆయనని శాసనసభ ఉప సభాపతిగా నియమించాలని నిర్ణయించారు. నేడో రేపో ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడనుంది. రఘురామ కృష్ణరాజు సొంత పార్టీలో అవమానాలకు, చిత్రహింసలకు గురవగా టిడిపిలో ఇంత గౌరవం లభిస్తోంది.
గమ్మతైన విషయం ఏమిటంటే, శాసనసభ సమావేశాలలో పాల్గొనవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని టిడిపి, జనసేనలు కోరుతున్నాయి. షర్మిల కూడా ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సలహా ఇస్తున్నారు కూడా.
కానీ మరోపక్క జగన్ ఎవరిని చూసి చాలా భయపడతారో, ఎవరిని అమితంగా ద్వేషిస్తారో వారిరువురినీ అంటే అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణరాజులని శాసనసభ స్పీకర్, డెప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అంటే పులుల గుహలోకి మేకపిల్లని రమ్మనమని ఆహ్వానిస్తున్నట్లే. వస్తే ఏమవుతుందో జగన్‌కు బాగా తెలుసు. కనుక వచ్చే ఎన్నికల వరకు జగన్ శాసనసభలో అడుగుపెట్టకపోవచ్చు.
అయితే రఘురామ కృష్ణరాజు జగన్‌ని ఎదిరించారు కనుకనే ఆయనకి చంద్రబాబు నాయుడు ఈ పదవి కట్టబెట్టారని అనుకోలేము.
ఆనంద గజపతిరాజు, బేబీ నాయిన, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు క్షత్రియ ప్రముఖులను ఈవిదంగా గౌరవించడం ద్వారా రాష్ట్రంలో బలమైన క్షత్రియ సామాజిక వర్గం టిడిపికి దగ్గరవుతుంది కూడా. కనుక రఘురామ కృష్ణరాజుతో జగన్‌కు ఓ పక్క చెక్ పెడుతూనే, రాజకీయంగా టిడిపికి మేలు కలిగేలా చంద్రబాబు నాయుడు వ్యవహరించారని భావించవచ్చు.




