పోలీసులు గుండాలైతే…. జగన్‌కి వారి రక్షణ ఎందుకు?

Jagan police media controversy

జగన్‌ ఎప్పుడూ ‘నా మాటే శాసనం’ అన్నట్లు రాజకీయాలు చేస్తుంటారు తప్ప వాటి పర్యావసనాలను పట్టించుకోరు. తన రాజకీయ, విధానపరమైన నిర్ణయాల కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయిందనే సంగతి మరిచి మళ్ళీ తనకు తోచినట్లు మాట్లాడుతున్నారు.. రాజకీయాలు చేస్తున్నారు.. అదే కరెక్ట్ అనుకుంటున్నారు.

‘రప్పా రప్పా..తలలు నరుకుతాం’ అంటూ వైసీపీ కార్యకర్తలు జగన్‌ పర్యటనలో ఫ్లెక్సీ బ్యానర్ ప్రదర్శిస్తే వారిని వారించకపోగా సమర్ధించారు. తద్వారా తాము ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తామని జగన్‌ స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది కదా?

ADVERTISEMENT

ప్రజలు కూడా భయపడేలా జగన్‌ ఈవిదంగా మాట్లాడుతుంటే పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకతం పేరి నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నా బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు సైతం జగన్‌కు చెప్పలేక సమర్ధించాల్సివస్తోంది. వారికి వేరే ప్రత్యామ్నాయం లేనందునే గుడ్డిగా జగన్‌ని అనుసరిస్తున్నారని అర్దమవుతూనే ఉంది. కానీ జగన్‌ ఈవిదంగా వ్యవహరిస్తుంటే తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటని ఓ సారి ఆలోచించుకుంటే మంచిది.

పార్టీలో ఎవరికీ చెప్పే ధైర్యం లేక తనని సమర్ధిస్తుండటంతో జగన్‌ మరింత రెచ్చిపోతున్నారు. డీజీపీని, పోలీస్ అధికారులను గుండాలు, మాఫియా గ్యాంగ్‌లని ఆక్షేపించడం, ఈనాడు పత్రికని టాయిలెట్ పేపర్‌కి ఎక్కువ టిష్యూ పేపర్‌కి తక్కువ అంటూ జగన్‌ మాట్లాడిన మాటలే ఇందుకు తాజా ఉదాహరణ.

ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి హాజరత్తయ్య విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ, “నాడు మీ హయంలో పనిచేసిన పోలీసులే నేడూ పని చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ మమ్మల్ని గూండాలు, మాఫియాలతో పోల్చడం చాలా దారుణం. ఇటువంటి మాటలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తాయి.

జగన్‌ పొదిలి పర్యటనలో మా పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే కనీసం ఖండించకపోగా మమ్మల్ని ఇలా నిందిస్తున్నారు. మాకు రాజకీయాలను ఆపాదించడం చాలా శోచనీయం. ఐపీఎస్ అధికారి సిద్ధార్ధ కౌశల్ వ్యక్తిగత కారణాలతో తన పదవిని రాజీనామా చేస్తే దానిపై కూడా రాజకీయం చేశారు.

ప్రభుత్వాలు మారుతాయి కానీ పోలీస్ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కనుక రాజకీయాలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా ‘రూల్ ఆఫ్ లా’ అమలు చేస్తుంటే మాకు రాజకీయాలు అంటగట్టడం, మా గురించి ఈవిదంగా అనుచితంగా మాట్లాడటం తగదు,” అని అన్నారు.

జగన్‌ జిల్లా పర్యటనలకు బయలుదేరినప్పుడు ఆయనకు పోలీసులే రక్షణ కల్పిస్తుంటారు. ఆ రక్షణ సరిపోవడం లేదని జగన్‌ వాదిస్తుంటారు.

పోలీసులంటే గూండాలు, మాఫియా గ్యాంగులని జగన్‌ వాదిస్తున్నప్పుడు అటువంటి వారి రక్షణ కోరడం దేనికి?

ఈవిదంగా వారి గురించి చులకనగా, అనుచితంగా మాట్లాడుతూ వారిని కూడా శత్రువులుగా మార్చుకుంటున్నానని జగన్‌ గ్రహించలేకపోతున్నారు. పైగా డీజీపీ స్థాయి ఉన్నతాధికారిని ఉద్దేశించి ఈవిదంగా మాట్లాడగలగడం తన ధైర్యానికి ప్రతీక అని జగన్‌ గర్వపడుతున్నారు.

‘ఈనాడు’ని టాయిలెట్ పేపరుతో పోల్చినప్పుడు మరి ‘సాక్షి’, వైసీపీ సోషల్ మీడియాని దేనితో పోల్చాలో జగన్‌ చెపితే బాగుండేది.

తెలంగాణలో కేటీఆర్‌, ఇక్కడ జగన్‌ ఇద్దరూ తమకు భజన చేస్తున్న సొంత మీడియాని గుడ్డిగా నమ్ముకొని బోర్లా పడ్డారు. తమకు హితవు చెప్పే మీడియాని ఉక్కుపాదంతో అణచివేయాలనుకుంటున్నారు.

ఇటువంటి ఆలోచనలు, పోకడలు, నోటి దురద మాటలే అక్కడ బీఆర్ఎస్‌ పార్టీని, ఇక్కడ వైసీపీని ప్రజలు తిరస్కరించేలా చేశాయని గ్రహించకుండా, ఇద్దరూ అదే ధోరణిలో ముందుకు సాగుతూ భస్మాసురిడిలా తమ పార్టీలను తామే దెబ్బ తీసుకుంటూ కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు కాంగ్రెస్‌, బీజేపీ, కూటమి పార్టీలకు శ్రమ తగ్గిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories