సంక్షేమ పథకాలకు కత్తెర….అమ్మ ఒడితోనే ప్రారంభం?

Jagananna -amma vodiనవరత్నాలు ప్లస్ సంక్షేమ పధకాలు మైనస్ ఆదాయం, మైనస్ అభివృద్ధి, ప్లస్ అప్పులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంకలా కుప్పకూలిపోకుండా నిలబెట్టే బాధ్యతని ప్రభుత్వం ప్రజలకే అప్పగించింది. అందుకుగాను కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు కోతలు భరించమని చెప్తోంది. ఆర్టీసీ ఛార్జీలు పెంచి సర్దుకుపోవాలని సూచిస్తోంది. తెలివిగా ఇంటిపన్నును భూముల మార్కెట్‌ ధరలతో ముడిపెట్టి ఎప్పటికప్పుడు ఇంటి పన్నులు ఆటోమేటిక్‌గా పెరిగే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అవసరమైనప్పుడు మళ్ళీ వేరేగా ఇంటి పన్ను పెంచుకొనే వెసులుబాటు కూడా కల్పించుకొంది. ఇంటి పన్ను చెల్లించినా ప్రతీ ఇంటికీ రూ.120 చొప్పున చెత్తపన్ను చెల్లించాలంటూ జగనన్న సర్కార్ హుకుం జారీ చేసింది. ఇంకా ఇలాంటి చెత్త పన్నులు వైసీపి అమ్ముల పొదిలో ఇంకెన్ని ఉన్నాయో అని ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు.

అయితే ప్రజలకు ఇన్ని కత్తెర్లు వేస్తున్నా ఇంకా రాష్ట్ర ఆదాయం, ఖర్చుల బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అవ్వకపోవడానికి కారణం సంక్షేమ పధకాలే అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటికీ కత్తెర్లు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో జగనన్న గొప్పగా చెప్పుకొన్న అమ్మ ఒడి పధకానికి తొలి కత్తెర పడింది.

ADVERTISEMENT

నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌కి వాడిన వారందరూ ధనవంతులుగా పరిగణించి వారికి అమ్మ ఒడి పధకాన్ని కట్ చేసింది. అలాగే గత ఏడాది నవంబర్‌ 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు 75 శాతం హాజరు ఉంటేనే సదరు విద్యార్ధికి అమ్మ ఒడి. ఒక్క శాతం తగ్గినా లభించదని చెప్పేసింది. అమ్మ ఒడిలో కూర్చోవాలంటే కొత్త బియ్యం కార్డు తప్పనిసరి. అది కావాలంటే ముందుగా కొత్త జిల్లాల ప్రకారం తల్లితండ్రులు, పిల్లల ఆధార్‌ కార్డుల్లో మార్పులు చేసుకొని, దానిని బ్యాంక్ ఖాతాతో లింక్ చేసుకోవలసిందే. వీటిలో ఎక్కడ తేడా కొట్టినా అమ్మ ఒడి మరిచిపోవలసిందే! పాఠశాల విద్యాశాఖ ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ రకంగానైనా కొంత మందిని వదిలించుకొని కొంత భారం తగ్గించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని తల్లితండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా ఛార్జీలు పెంచడానికి, ప్రజలపై కొత్త కొత్త పన్నులు విధించడానికి అవకాశం లేకనే ప్రభుత్వం అమ్మ ఒడికి కత్తెర వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనుక ఇది అమ్మఒడికే పరిమితం కాదని దీంతోనే ప్రారంభం అని, రాబోయే రోజుల్లో మిగిలిన సంక్షేమ పధకాలకు కూడా కత్తెర్లు తప్పవని అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రం అప్పులకుప్పగా మారిపోతున్నా మళ్ళీ అధికారంలోకి రావడం కోసం సంక్షేమ పధకాలను కొనసాగిస్తున్న జగనన్న ప్రభుత్వం, వాటికే కత్తెర వేసుకొన్నట్లయితే కూర్చోన్న కొమ్మను నరుకొన్నట్లే అవుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories