మేము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతల తీరు. ఓ పక్క సిఎం చంద్రబాబు నాయుడు, ముగ్గురు కేంద్ర మంత్రులు, కూటమి ఎంపీలు రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇందుకు కేటీఆర్, హరీష్ రావుల ఏడ్పులే చక్కటి నిదర్శనం.
మరోపక్క వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోతుందని, దానిలో పులస చేపలు పట్టుకొని కూటమి నేతలు హాయిగా ఆరగించవచ్చని,” ఎద్దేవా చేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు చంచల్ గూడా జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారని తెలిసి ఉన్నప్పటికీ ప్రజలు అయనకి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకొని ఉంటే నేడు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతుండేవారు.
కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేయడంతో ప్రజలు నిర్దాక్షిణ్యంగా గద్దె దించేశారు. అయినా జగన్, వైసీపీ నేతల బుద్ధులు మారలేదు.
జగన్‌కి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు మూడు రాజధానులు కడతామని గొప్పలు చెప్పారు. చివరికి విశాఖని రాజధానిగా చేయలేకపోయారు.
ఒకానొక సమయంలో విశాఖ రాజధాని అంటే రుషికొండపై రూ.500కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి తాను నిర్మించుకున్న ప్యాలసులే… దానిలో తాను అడుగుపెడితే విశాఖ రాజధాని అయిపోయినట్లే అని జగన్ & కో వితండ వాదనలు చేశారు. కానీ జగన్ వాటిలో అడుగుపెట్టే సాహసం కూడా చేయలేకపోయారు.
ఇటువంటి అసమర్ధత నేతలు అమరావతి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. అయినా అమరావతి వద్దనుకుంటే జగన్ & కో 5 ఏళ్ళు అక్కడే ఎందుకు ఉన్నారు? చంద్రబాబు నాయుడు కట్టించిన శాసనసభ, సచివాలయంలను ఎందుకు వాడుకున్నారు? అనే ప్రశ్నలకు వైసీపీలో ఎవరూ సమాధానం చెప్పలేరు.
కానీ తాము చేయలేక చేతులెత్తేస్తే సిఎం చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారనే అసూయతోనే వైసీపీ నేతలు ఈవిదంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.
ఇక్కడ వైసీపీ నేతలు అమరావతి నీళ్ళలో మునిగిపోవాలని, పోలవరం బ్యారేజ్ కొట్టుకుపోవాలని, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకూడదని కోరుకుంటుంటే, అక్కడ ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీకి నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు కృషి చేస్తున్నారు.
వైసీపీ నేతలు నేటికీ విధ్వంసకర వైఖరితోనే ముందుకు సాగుతుంటే, కూటమి నేతలు ఈవిదంగా రాష్ట్రాభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ తేడాని రాష్ట్ర ప్రజలందరూ గమనించి గుర్తుంచుకొని ఎన్నికలలో తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది.






