పవన్ ఆ మాట అనకుండా ఉంటే బాగుండేది!

Jana sena laegations on TDP corruptionసరికొత్త రాజకీయాలను పరిచయం చేస్తానని చెప్పిన ‘జనసేన’ అధినేత భావాలు ఆదర్శప్రాయంగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే అధికార ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని తీవ్ర విమర్శలతో చేసిన దాడి అందరికీ తెలిసిందే. తప్పును ఎత్తి చూపించడంలో ఏ మాత్రం తప్పు లేదు గానీ, ఇంకా ఇన్నాళ్ళు ఉపేక్షించినందుకు పవన్ ను విమర్శించాల్సి ఉంటుంది. కానీ, రాజకీయ ప్రక్షాళన చేస్తానని చెప్తోన్న పవన్ కళ్యాణ్ నోట నుండి రాకూడని కొన్ని మాటలు రావడం విస్తుపోయే అంశం.

ADVERTISEMENT

‘అవినీతిమయం అయిన ఈ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు పంచి పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పిన పవన్, వాళ్ళంతా ఓట్లు కోసం డబ్బులు పంచుతారు, వాటిని మీరు తీసుకోండి, అవసరమైతే ఓటుకు 2 వేలు కాదు, 5 వేలు డిమాండ్ చేయండి, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుని జనసేనకు ఓటేయండి’ అంటూ పవన్ ఇచ్చిన పిలుపు ఏ మాత్రం సమంజసం కాదు.

రాజకీయ ప్రక్షాళన అంటే ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదు. రాజకీయ నాయకుల తీరుతో పాటుగా ప్రజలను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ‘జనసేన దగ్గర డబ్బులు లేవు గనుక, వాళ్ళు పంచుతారు, మీరు మాకు ఓటు వేయండి’ అంటే ఏ రకమైన సందేశాలను జనాల్లోకి పవన్ పంపుతున్నట్లో అర్ధం చేసుకోవాలి. అంటే డబ్బులు పంచనిదే ఓట్లు రాలవని పవన్ కూడా తీర్మానిస్తున్నారా? అదే జరిగితే నవశకం రాజకీయాలలో తేడా ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తన మనసులోని భావాన్ని చెప్పారో లేక టంగ్ స్లిప్ అయ్యారో గానీ, ఈ మాటలను ఒకటికి రెండు సార్లు చెప్పడంతో అభిమానుల్లోకి, ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయాయి. అలా కాకుండా డబ్బులు ఇవ్వడానికి వస్తారు, మాకొద్దు మీ అవినీతి సొమ్ము, కష్టపడి మేం సంపాదించుకుంటాం… అని వారి ముఖాన చెప్పండి అని పవన్ పిలుపునిచ్చినట్లయితే… 100కు 100 శాతం కాకపోయినా, కనీసం ఓ 10 శాతం మందిలో అయినా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ప్రజాస్వామ్యానికి కావాల్సింది కూడా అదే!

ADVERTISEMENT
Latest Stories