జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల్సిందిగా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ సంధర్భంగా పార్లమెంట్ లో కవిత ఏపీకి మద్దతుగా మాట్లాడారు కాబట్టి అవిశ్వాసానికి తెరాస సపోర్ట్ చేస్తుందని, కావాల్సిన మిగతా పార్టీల సపోర్ట్ తాను సమీకరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
అంతకు ముందు చెల్లెలు కవిత అని సంబోధిస్తూ కృతజ్ఞతలు చెప్పారు కూడా. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద కొందరు పాత్రికేయులు ఏపీకి ప్రత్యేక హోదా గురించి, అవిశ్వాసం గురించి ప్రస్తావించారు. హామీ ఇచ్చిన ప్రకారం ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. అదే సమయంలో అవిశ్వాసానికి తాము మద్దత్తు ఇవ్వబోమని చెప్పకనే చెప్పారు.
అవిశ్వాసం అనేది చీప్ పొలిటికల్ ట్రిక్ అని కేసీఆర్ అభివర్ణించారు. దీనిబట్టి పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు తెరాస మద్దత్తు రాదని తేలిపోయింది. రాజకీయాలలో 2+2 అనేది ఎప్పుడూ నాలుగు అవ్వాలని లేదు . ఆయా సంధర్భాన్ని బట్టి పార్టీల రాజకీయ అవసరాన్ని బట్టీ ఆ లెక్క మారుతూ వస్తుంది. నిజంగా ఏపీకి ప్రత్యేక హోదా అనేది వస్తే మొదట వ్యతిరేకించేది తెరాసనే.
ఎందుకంటే దాని వల్ల ఎక్కువ నష్టం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకే. ఎలాగూ రావడం లేదని నోటి మాటగా, సెటిలర్ల ఓట్ల కోసం కొన్ని మాటలు చెప్పవచ్చుగాక అంత మాత్రానా ఏపీ కోసం, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎందుకు మోడీతో తగాదా పెట్టుకుంటారు? ఇంత చిన్న లాజిక్ పవన్ కళ్యాణ్ ఎలా మిస్ అయ్యారు? నిజంగా జగన్ గానీ ఇంకొకరు గానీ అవిశ్వాసం పెట్టినా దానిని కన్సిడర్ చెయ్యాల్సిన 50 ఎంపీల మద్దత్తు కూడా చాలా కష్టం. మోడీ ప్రభుత్వం మరింత కక్ష సాధింపు తప్ప ఒరిగేది ఏమి ఉండదు.



