‘జనసేన’ తొలి ఆవిర్భావ సభ నుండి నాలుగేళ్ల ప్రస్థానం సభ వరకు దాదాపుగా అన్ని బహిరంగ సభల్లోనూ పవన్ సూటిగా ప్రస్తావించిన అంశం ఏదైనా ఉందంటే… అది ఒక్క తన ప్రాణాల గురించే..! ‘తాను చావుకు కూడా సిద్ధపడి వచ్చానని, మీ కోసం అవసరమైతే నేను చనిపోతానని, ఉన్నంత కాలం సమాజానికి మంచి చేయాలనే తాపత్రయం తప్ప మరొక లక్ష్యం తనకు లేదని’ ఇలా ఒకే అభిప్రాయాన్ని వివిధ సందర్భాలలో వ్యక్తపరిచారు. కాజాలో నిర్వహించిన సభలోనూ ఇవే వ్యాఖ్యలను రిపీట్ చేసారు.
అంటే తనకు ప్రాణ ముప్పు ఉందని పవన్ గుర్తించారా? ఏమైనా వార్నింగ్ కాల్స్ పవన్ కు మ్రోగాయా? అన్నది సందేహాలుగా మారాయి. సభకు ముందు రోజు ఏపీ డీజీపీ రాసిన లేఖలోనూ… సెక్యూరిటీ విషయమై తెలుపుతూ తనకు ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఒకవేళ అలాంటి డేంజర్ బెల్స్ ఏమైనా ఉంటే… ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపించి అదనపు సెక్యూరిటీని నియమించుకోవచ్చు కదా! లేదంటే వ్యక్తిగత సిబ్బంది పెట్టుకోవచ్చు కదా!
పవన్ వ్యవహార తీరు మాత్రం ప్రాణ భయానికి భిన్నంగా ఉండడంతో, నిజంగా పవన్ కు ఇలాంటి భయం ఉందో లేదో తెలియదు గానీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయం ఉందా? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ వర్గాలు. కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడాలంటే రాష్ట్రంలోని ఇద్దరు ప్రధాన నేతలు భయపడిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు… నాకంటే కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ తెలుసు… అంటూ పరోక్షంగా చంద్రబాబు, జగన్ లపై ఉన్న కేసుల గురించి ప్రజలకు గుర్తు చేసారు.
పవన్ వ్యాఖ్యల ప్రకారం… నిజంగానే చంద్రబాబు, జగన్ లు తమపై ఉన్న కేసులకు భయపడిపోయారని అనుకుందాం. మరి పవన్ భయపడలేదా? అంటే… నేను ఎవరికీ భయపడను, తప్పు చేస్తే కదా భయపడాలి, నేనెలాంటి తప్పు చేయలేదు, ఎవరికీ భయపడను…. అనే పవన్ కళ్యాణే అందరి కంటే ఎక్కువ భయపడ్డట్లుగా కనపడుతోంది. అవును… దాదాపుగా రెండు గంటల సేపు సాగిన ప్రసంగంలో కనీసం ప్రధాని పేరును కూడా తలవడానికి భయపడేటంతగా ప్రభావితులు అయినట్లుగా కనపడుతోంది.
అరుణ్ జైట్లీ… అంటూ ప్రారంభించిన పవన్ ప్రసంగంలో ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ అన్న ముక్క తప్ప, నరేంద్ర మోడీ అన్న పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదంటే… ఎంత జాగ్రత్తగా ఈ స్పీచ్ ను ప్రిపేర్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఆ ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా’ను నడిపిస్తోంది ఎవరు? ఆయనకు ఊరు, పేరు లేవా? కనీసం పేరు పలకడానికే భయపడ్డ పవన్ కళ్యాణ్, నిజంగా చంద్రబాబు, జగన్ లను విమర్శించడానికి అర్హుడా? అనేది ఆయనే ఆలోచించుకోవాలి. అందులోనూ ఎక్కువగా చవకబారు విమర్శలే ఉండడం గమనార్హం.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే…. ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తాను, అయితే అది ఢిల్లీలోని జంతర్ మంతర్ కాదు, ఆంధ్రప్రదేశ్ అమరావతిలో చేస్తాను…. అంటూ పవన్ చెప్పడం మరోసారి బిజెపిపై పవన్ కున్న భయతత్వాన్ని ప్రతిబింబించింది. ‘స్పెషల్ స్టేటస్’పై పోరాటం అనేది కేంద్ర ప్రభుత్వంపై చేసేది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శలు చేసినా… ఎంతగా తిట్టినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. నిజంగా పవన్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రణాళిక చేపట్టాలి తప్ప… ఇలా కాదు..!



