జనసేన టిడిపితో పొత్తులు పెట్టుకున్నప్పుడే పార్టీలో, శ్రేయోభిలాషులమని చెప్పుకునే కొందరు పెద్దలు, చివరికి కొన్ని వెబ్‌సైట్స్ కూడా వ్యతిరేకించాయి. కానీ పదేళ్ళు రాజకీయాలలో నలిగిన పవన్ కళ్యాణ్‌కు ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తే ‘వీర మరణం’ తప్పదని ఎప్పుడో చెప్పారు.
ఆయన చెప్పకపోయినా గత ఎన్నికలలో ఏం జరిగిందో జనసేన నేతలు, వారి శ్రేయోభిలాషులు ఓసారి గుర్తు చేసుకుంటే నేడు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ నేటికీ కొంతమంది గుడ్డిగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు.
ఇటువంటి అవకాశం కోసమే వైసీపి కాచుకు కూర్చొని ఎదురుచూస్తోందని గ్రహించకుండా, మీడియా ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను ‘శ్రేయోభిలాషుల’ ముసుగులో వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
దీని వలన పార్టీ శ్రేణులలో అయోమయం, జనసేనవైపు మొగ్గు చూపుతున్న వర్గాలలో అయోమయం ఏర్పడుతోంది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ తీస్తుందని పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతూ, నేడు సోషల్ మీడియా ద్వారా పార్టీ నేతలకు ఓ లేఖ వ్రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తులు పెట్టుకుంటున్నామని పార్టీలో అందరూ గ్రహించాలని, కానీ ఎవరికైనా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నట్లయితే తన రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్‌కి తెలియజేయాలని లేఖలో కోరారు.
పార్టీలో ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి పొత్తులకు విఘాతం కలిగేవిదంగా మాట్లాడవద్దని, అలా మాట్లాడినవారిని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన్నట్లు పరిగణించి చర్యలు తీసుకోవలసి వస్తుందని పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించారు. త్వరలోనే మూడు పార్టీల మద్య పొత్తులు ఖరారు కాబోతున్నాయని పవన్ కళ్యాణ్ సూచించారు.
టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా కలిస్తే దాని కోసం టిడిపి, జనసేన రెండు పార్టీలు కొన్ని సీట్లు వదులుకోవలసి ఉంటుంది. అయితే ఈవిషయంలో టిడిపి నేతలు చాలా సంయమనం పాటిస్తున్నప్పటికీ, జనసేనలో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.
కానీ వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రతీమాట వలన పార్టీతో పాటు తాము కూడా నష్టపోతున్నామని గ్రహించడం చాలా అవసరం. ముఖ్యంగా మూడు పార్టీల పొత్తులు పెటాకులు అవ్వాలని ఆశపడుతున్నవారు మన చుట్టూ చాలామందే ఉన్నారని తెలిసి ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. పవన్ కళ్యాణ్ అదే చెపుతున్నారు.




