ఇరు పార్టీల పొత్తు తో నూతనోత్సహం తో ముందుకెళ్తున్న పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేయగలిగితే 2014 ఎన్నికల ఫలితాలకు మించి విజయాన్ని అందుకోవచ్చు అని గణాంకాలు తెలియచేస్తున్నాయి. 2014 ఎన్నికలలో జేఎస్పీప్ ఎన్నికల బరిలో పోటీ చేయకుండా టీడీపీ + బీజేపీ కి తన మద్దతుని తెలిపింది. వైసీపీ పార్టీ వ్యతిరేకుల ఓట్లు చీలిపోకుండా ఈ మద్దతు ఉపయోగపడింది.
అలాగే 2019 ఎన్నికలలో మూడు పార్టీలు విడివిడిగా పోటీచేసినప్పటికీ బీజేపీ..టీడీపీ పార్టీ గెలుపుని కానీ వైసీపీ పార్టీ ఓటమిని కానీ నిర్ణయించే స్థాయిలో లేదనే చెప్పాలి. ఒకరకంగా నోటా ఓట్ల కంటే తక్కువ ఓటు శాతం బీజేపీ పార్టీ నమోదు చేసింది. కానీ జనసేన మాత్రం సుమారు ముప్పై – నలభై స్థానాలలో టీడీపీ గెలుపుని అడ్డుకుని వైసీపీ విజయానికి తోడ్పడింది.
రెండు పార్టీలు దమ్ముంటే విడివిడిగా రావాలంటూ వైసీపీ చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాల వెనుక ఉన్న పరమార్ధం ఇదే. గత ఎన్నికల ఫలితాల లెక్కలతో ఈ “రెండు పార్టీల పొత్తు వైసీపీ చిత్తు”.. అంటూ సామజిక మాధ్యమాలలో లెక్కలతో వివరిస్తున్నారు ఇరు పార్టీల అభిమానులు.
గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన పేర్ని నాని మచిలీపట్నం, నగరి రోజా,సత్తెనపల్లి అంబటి, నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్, అవంతి భీమిలి…. ఇలా మీడియా ముందు అడ్డు – అదుపు లేకుండా నోరు పారేసుకొనే నేతలందరిది ఓట్ల చీలిక వలన వచ్చిన గెలుపే. పేర్ని నాని.. 66141 ఓట్లను నమోదుచేసుకోగా.., టీడీపీ 60290 ఓట్లతో రెండవస్థానంలో ఉండటానికి జేఎస్పీ 18807 ఓట్లను చీల్చింది. రెండు పార్టీల ఓట్లను లెక్కిస్తే 79097 అది నాని విజయాన్ని నివారించి ఉండేది.
అలాగే నగరి రోజా మెజారిటీ సుమారుగా 2500 ఓట్లు మాత్రమే…, బాబు ఇంటి మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ నియోజక వర్గంలో కూడా జనసేన 25 వేల ఓట్లను చీల్చింది. టీడీపీ + జేఎస్పీ=79814, వైసీపీ =61920. పొత్తు ఉండకూడదు అని వైసీపీ చేస్తున్న ఆగానికి ఆధారాలు ఇవి మచ్చు తునకలే. అసలు ఈ వైసీపీ నేతలు స్వామి భక్తి చుపించాల్సింది జగన్ కు కాదు పవన్ కి అనేది ఈ గణాంకాలు చూస్తున్న వారికి అర్ధమవుతుంది.
సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఆయా పార్టీల ఓటు శాతాన్ని తగ్గిస్తుంది. అందునా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజల పై పడిన పన్నుల భారం, నిత్యావసరాల పెరుగుదల, కరెంట్ బిల్లుల మోతతో సామాన్య మధ్యతరగతి గడిచిన ఐదేళ్లలోనే దిగువ మధ్యతరగతి స్థాయికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ కొద్దీ వర్గం ఓట్ల కోసం పధకాల పేరుతో పంచిపెడుతున్న మొత్తాన్ని మధ్యతరగతి నడ్డి విరిచి వసూలు చేస్తుందనే భావన ఇప్పటికే వారిలో పాతుకు పోయింది.
పవన్ వారాహి యాత్రతో సామజిక పరంగా తనకు పట్టుందని భావించే ఉభయ గోదావరి జిల్లాలలో పార్టీ బలోపేతం చేశారు. గతంకంటే తన పార్టీ ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడంలో వారాహి యాత్ర పవన్ కి ప్లస్ అయ్యింది. అలాగే నిత్యం ప్రజలలో ఉంటూ టీడీపీ అధినేత బాబు, యువగళంతో లోకేష్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు.
బాబు అరెస్టుతో రాష్ట్రంలో సింహ భాగం ప్రజలలో చంద్రబాబు పట్ల, ఆపార్టీ పట్ల సానుభూతి పెరిగింది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక, ఉద్యోగులకు సమయానికి జీతాలు తీసుకోలేక ఇలా ప్రతి ఒక్కరిలో ఎంతోకొంత వ్యతిరేకత నెలకొంది.
గత ఎన్నికల ఓటు శాతం గణాంకాలను నిలపెట్టుకుని…, ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకొని.., పార్టీ నేతల యాత్రల ద్వారా సంపాదించుకున్న మైలేజ్ ని దృష్టిలో ఉంచుకొని చూసినా కూటమి గెలుపు కష్టమేమి కాదు. అలా అని ఏమరుపాటుగా ఉన్న వైసీపీ కేంద్రం తో తనకున్న రహస్య బంధం తో రెండు పార్టీలను చావు దెబ్బ కొట్ట గలదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.