
టిడిపి, జనసేనల మద్య పొత్తులు కుదిరిపోయాయి. రెండు పార్టీల అధినేతలు, నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కూడా. అయితే పొత్తులలో అత్యంత క్లిష్టమైన సీట్ల సర్దుబాటు దశకు చేరుకొన్నాయిప్పుడు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలుపెట్టారు. మరో రెండుమూడు సార్లు సమావేశమయ్యి సంక్రాంతిలోగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ సీట్లు?ఎవరెవరు అభ్యర్ధులు? అనే విషయం సంక్రాంతి పండుగలోగా తేల్చేయాలని ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు.
Also Read – జగన్ అనుకున్నట్టే బట్టలు ఊడతీస్తున్నారుగా…
జనసేన-బీజేపీలు కలిసి పోటీ చేసి ఉండి ఉంటే జనసేనకె మెజార్టీ సీట్లు లభించి ఉండేవని వేరే చెప్పక్కరలేదు. కానీ టిడిపి నుంచి కూడా కనీసం 50-65 సీట్లు, 4-5 లోక్‌సభ సీట్లు డిమాండ్ చేస్తోందని కానీ జనసేనకు 25 శాసనసభ, 2 ఎంపీ సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌కు చెప్పిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో జనసేన చాలా బలపడిందని, ఆ ఆలోచనతోనే జనసేనలో టికెట్స్ ఆశిస్తున్న పలువురు నేతలు, జనసేన సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాల కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు టిడిపితో పొత్తుల కారణంగా తమకు టికెట్స్ లభించకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read – జగన్‌తో సహవాసం.. ముగింపు ఇలాగే!
వాస్తవంగా చూస్తే వారి ఆందోళన సహేతుకమే అని అర్దమవుతోంది. పొత్తుల కోసం పవన్ కళ్యాణ్ వారిని బలిచేసుకోలేరు కనుక 50-65 సీట్లు అడగడం కూడా సహేతుకమే అని చెప్పొచ్చు.
కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్నందున వారిలో ఎంతమంది దేశముదురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పోటీ పడి డబ్బు ఖర్చుపెట్టగలరు?ఎంతమంది వారి ధాటిని తట్టుకొని నిలబడి గెలవగలరు?అని ప్రశ్నించుకొంటే జనసేనకే సమాధానం లభిస్తుంది.
Also Read – మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా?
ఒకవేళ జనసేన 50-65 శాసనసభ సీట్లు తీసుకొంటే అది కోల్పోయిన ప్రతీ ఒక్క సీటు వైసీపికే దక్కుతుందని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ వాటిలో 30-40 సీట్లు కోల్పోయినా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యి వైసీపి గెలిచే అవకాశం పెరుగుతుంది.
కనుక ఈ ప్రయత్నంలో టిడిపి, జనసేనల కూటమి గెలిచి అధికారంలోకి రావడమే ముఖ్యం అని జనసేన నేతలు, కార్యకర్తలు గ్రహిస్తే వారు కూడా తొలిసారిగా అధికారంలోకి రాగలుగుతారు. అదే సీట్ల కోసం పట్టుబట్టి వాటిని వైసీపికి సమర్పించుకొంటే, వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, జనసేన రెంటినీ జగన్మోహన్ రెడ్డి తుడిచిపెట్టేయడం తధ్యం అని మరిచిపోకూడదు. టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లలో బేధాభిప్రాయాలు వస్తే వాటిని విడగొట్టి ఓడించేందుకు వైసీపి కాసుకు కూర్చోందనే విషయం మరిచిపోకూడదు.
అయితే జనసేనలో టికెట్స్ ఆశించి ఇన్నేళ్ళుగా నియోజకవర్గాలలో పనిచేసుకొంటూ భారీగా ఖర్చు చేసిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేయగలమనే నమ్మకం కల్పించవలసిన బాధ్యత టిడిపి, జనసేన అధినేతలదే. కనుక టిడిపి, జనసేనలలో ఎవరూ నష్టపోకుండా చూసుకొంటూనే, కేవలం గెలుపు గుర్రాలని మాత్రమే బరిలో దింపడం చాలా చాలా అవసరం. లేకుంటే వైసీపి నేతలు చెపుతున్నట్లు రెండు పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు