సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 8వ తేదీన విగతజీవిగా ప్రజలకు కనిపించారు. ఈ 77 రోజుల వ్యవధిలో అమ్మకు ఎలాంటి వైద్యం అందించారో, అసలు ఎలా ఉన్నారో అనే విషయం అంతుచిక్కని రహస్యం. తమిళనాడు వాసుల్లోనే కాదు, దేశ ప్రజలందరి మదిలోనూ ఉన్న అనేక సందేహాలకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో గానీ, ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఓ అదిరిపోయే షాక్ ను ఇచ్చింది.
77 రోజుల జయలలిత చికిత్సకు గానూ ఏకంగా 80 కోట్ల రూపాయల బిల్లును అపోలో హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించడం హాట్ టాపిక్ గా మారింది. అంటే రోజుకు ఒక కోటి రూపాయలు పైగానే ‘అమ్మ’కు వైద్యం అందించారన్న మాట. ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో అందరూ నోరెళ్ళబెడుతున్నారు. రోజుకు కోటి రూపాయల వైద్యం అందించే ప్రక్రియ ఏమై ఉంటుందా… అని తెల్లముఖం వేయడం సామాన్య ప్రజల వంతవుతోంది.
ఈ మొత్తం బిల్లులో ఇప్పటికే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ 6 కోట్ల రూపాయలను చెల్లించింది. ఒక ముఖ్యమంత్రిగా అధికార హోదాలో జయలలిత చేరడంతో, ఆసుపత్రి ఖర్చంతా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. జయలలితను ఆసుపత్రి రెండో అంతస్తులో ఉంచగా, అందులోని మిగతా గదులన్నీ ఖాళీ చేయించి, ప్రత్యేకంగా వైద్యం అందించినందుకే ఇంత మొత్తంలో బిల్లు అయ్యిందన్న టాక్ వినపడుతోంది. ఈ బిల్లులోని అంశాలను పరిశీలిస్తే…
సదరు గదులన్నింటి అద్దెతో పాటు లైఫ్ సపోర్ట్ యాంత్రాల అద్దెలు, 39 మంది వైద్యులకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, లండన్ నుంచి పలుమార్లు వచ్చి వెళ్లిన డాక్టర్ రిచర్డ్ బిలే వైద్య ఖర్చులు మరియు అతని టీమ్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే బిల్లు జాబితా చాంతాడంత ఉంది. జయలలిత గుండె ఆగిన తరువాత అమర్చిన ఎక్మో యంత్రానికి అద్దె రోజుకు కోటి రూపాయలుగా అపోలో యాజమాన్యం చార్జ్ చేసింది.



