వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ సమస్య ఇక ఎంతమాత్రం దానిలో పనిచేసే కార్మికుల సమస్య మాత్రమే కాదు. ఇప్పుడు ఇది అన్ని రాజకీయపార్టీల మనుగడకు, ఎన్నికల ప్రయోజనాలతో ముడిపడున్న సమస్య. ఇంకా చెప్పాలంటే అన్ని పార్టీలకు చక్కటి రాజకీయ మైలేజీని ఇచ్చే రాజకీయ చదరంగ వేదిక వైజాగ్ స్టీల్ ప్లాంట్.
కనుక తమ ఉద్యోగాలు నిలుపుకోవడం కోసం ఇంతకాలంగా ఒంటరిగా పోరాడుతున్న కార్మికులు, ఇప్పుడు ఇన్ని పార్టీలలో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో తెలీని పరిస్థితి. అందరూ తలో చెయ్యి వేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేస్తే పర్వాలేదు కానీ ‘మేము మాత్రమే కాపాడుతామని’ నమ్మబలుకుతుండతమే చాలా ఇబ్బందికరంగా మారింది.
ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు సింహాచలం వరకు పాదయాత్ర చేయగా వారికి మాజీ సీబీఐ జెడి లక్ష్మినారాయణ సంఘీభావం తెలిపారు. గమ్మతైన విషయం ఏమిటంటే శనివారం ఆయన కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధికారులను కలిసి ప్లాంట్‌లో పెట్టుబడి, నిర్వహణ, ముడిసరుకు సరఫరా, ఉత్పత్తి కొనుగోలుకి సంబందించిన ఈఓఈకి బిడ్ వేశారు. దీనిలో పాల్గొనేందుకు స్టీల్ ప్లాంట్ నిర్వహణతో సంబందం ఉన్నవారే వేయాలనే షరతు విధించినందున ఓ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తరపున ఆయన బిడ్ వేసిన్నట్లు సమాచారం.
అయితే దీని కోసం ఆయన వందల కోట్లు పెట్టుబడి పెట్టలేరనే సంగతి తెలుసు. మరి అంతా డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అనే ప్రశ్నకు క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్ నిధులు సమీకరిస్తామని లక్ష్మినారాయణ చెప్పారు. అంటే చందాల సేకరణ అన్నమాట! ఇది వెటకారమే కదా?
8.5 కోట్ల మంది ఒక్కొక్కరూ నెలకు కేవలం రూ.100 చందా ఇస్తే రూ.850 కోట్లు వస్తుందని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక నెల నిర్వహణకు అది సరిపోతుందని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన అందరికీ కనుక ఇలా నాలుగు నెలలు చందాలు వేసుకొంటే, అంతవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని తప్పక కాపాడుకోవచ్చని, ఆలోగా ప్రత్యామ్నాయమార్గాలను ఆన్వేషించవచ్చని చెప్పారు.
ఐఏఎస్ అధికారి అయిన లక్ష్మినారాయణ ఇటువంటి విచిత్రమైన, ఆచరణ సాధ్యం కానీ ఆలోచనలు, ప్రతిపాదనలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంతకంటే కలిసి వచ్చే అన్ని పార్టీలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఉద్యమిస్తే ఏమైనా ఫలితం వస్తుంది కదా?



