రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఘనతను ‘ఓటుకు నోటు’ కేసు సొంతం చేసుకుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేసే క్రమంలో టీ టీడీపీ యువనేత, ప్రస్తుతం టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి వీడియో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డే అయినప్పటికీ ఈ కేసులో మధ్యవర్తిత్వం నెరిపాడని ఆరోపణలు ఎదుర్కొన్న క్రైస్తవ సంఘాల నేత జెరూసలేం మత్తయ్య కూడా కీలక నిందితుడుగా ఉన్నారు.
తెలంగాణ పోలీసులకు ఝలక్కిచ్చిన మత్తయ్య ఏపీకి మకాం మార్చి, హైకోర్టు నుంచి అరెస్ట్ భయం లేదంటూ హామీ వచ్చిన తర్వాతే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన హైకోర్టు మత్తయ్యపై కేసును ఇటీవల కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మత్తయ్య… ‘ఓటుకు నోటు’ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసును పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేసిన మత్తయ్య, తనపై కేసు కొట్టివేసిన మరుక్షణమే ఈ కేసు శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీ ఓటేయాలంటూ తనకు భారీగా ముడుపులు ఎరవేశారన్న నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందని కూడా మత్తయ్య పేర్కొన్నారు. మత్తయ్య చేసిన వ్యాఖ్యలే పొలిటికల్ వర్గాల్లో కూడా హల్చల్ చేస్తుండడంతో… అనధికారికంగా ‘ఓటుకు నోటు’ కేసుకు ‘శుభంకార్డు’ పడిపోయినట్లే… అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.



