అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వినియోగదారులను తన ఖాతాలో వేసుకున్న జియో, ఆల్ టైం రికార్డులను సృష్టించడంలో విజయవంతం సాధించిందేమో గానీ, ఉన్న కస్టమర్లను సంతృప్తి పరచడంలో మాత్రం కాదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉచిత మంత్రంతో ప్రజలను ఆకర్షించడంలో సక్సెస్ సాధించిన జియో, అంతే వేగంగా యూజర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడంలో మాత్రం విఫలమైంది.
రిలయన్స్ జియో సగటు 4జీ ఇంటర్నెట్ వేగం సగానికి పడిపోయిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) తాజాగా గణాంకాలను విడుదల చేసింది. మరో వైపు 4జీ నెట్ వర్క్ లో అత్యధిక డేటా బదిలీ చేస్తున్న సంస్థగా ఎయిర్‌టెల్ తొలిస్థానంలో నిలిచి, తన స్థాయిని చాటుకుంది. ఈ అంశంలో ఎయిర్‌టెల్ తరువాతి స్థానాల్లో ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో డేటా వేగాల్లో జియో వీటన్నింటి కన్నా ముందు నిలిచిన విషయం తెలిసిందే.
2017వ సంవత్సరం తొలి మాసం అయిన జనవరి నెలకు గాను 11.62 ఎంబీపీఎస్ డేటా వేగంతో ఎయిర్ టెల్ తొలిస్థానంలో నిలిచిందని ట్రాయ్ తెలిపింది. కాగా, జియో డేటా వేగం కేవలం 8.345 ఎంబీపీఎస్ గా మాత్రమే ఉందని, గతేడాది డిసెంబరు వరకు ఇదే జియో వేగం 18.146 ఎంబీపీఎస్ గా ఉండేదని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంలో ఎయిర్ టెల్ తరువాతి స్థానాల్లో ఉన్న ఐడియా, వొడాఫోన్ లు 10.562 ఎంబీపీఎస్, 10.301 ఎంబీఎపీఎస్ సగటు డేటా వేగాలను నమోదు చేశాయని ట్రాయ్ వెల్లడించింది.



