2019 ఎన్నికలకు ముందు వివేకా మరణం పై వైసీపీ ఆడిన రాజకీయ చదరంగంలో నాడు టీడీపీ ప్రభుత్వం, వివేకా కుటుంబం, ఏపీ ప్రజలు అందరూ పావులుగానే మిగిలారు అనే వాస్తవం ఆ నాటి ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన పరిణామాలతో అందరికి తెలిసొచ్చింది.
వివేకా దారుణ హత్యను గుండె పోటుగా చిత్రీకరించిన సాక్షి, నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసిన బ్లూ మీడియా, రాజకీయ ఆటలో ఒక మంచి మనిషి ప్రాణం తీస్తారా అంటూ జగన్ చేసిన ప్రచారం నాటి వైసీపీ గెలుపుకి నాంది పలికాయి.
అయితే అదే వివేకా హత్య కేసు నేటి 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమికి పునాది వేసింది. తన తండ్రిని ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన వ్యక్తులను వైస్ జగన్ కాపాడుతున్నాడని, వారి రక్షణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబానిసలా పని చేస్తుందని, ఈ విషయంలో తనకు న్యాయం కావాలంటూ వివేకా కూతురు సునీత గత ఐదేళ్లు అలుపెరుగని పోరాటం చేసింది.
ఈ పోరాటంలో చివరికి తన ప్రాణాలు కూడా పోవచ్చు అనే సంకేతాలు ఇస్తూనే ఈ యుద్ధంలో విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటా అంటూ వైసీపీ ఓటమికి తనవంతు పాత్ర పోషించారు సునీత. అయితే గత ఐదేళ్లు సునీత పోరాటానికి పరోక్ష మద్దుతు ప్రకటిస్తూ, వివేకా కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్రచారం చేసారు.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు మాసాలు ముగిసినప్పటికీ, సునీత పలుమార్లు హోమ్ మంత్రి అనితను, ముఖ్యమంత్రి బాబుని కలిసినా కేసు విచారంలో పురోగతి కనిపించడం లేదని, న్యాయం జరిగే అవకాశం కనుచూపుమేరలో కానరావడం లేదనే అనే అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది.
అలాగే అసలు వివేకా హత్య కేసులో బాధితులుగా ఉన్న ఆయన కుమార్తె సునీత ఆరోపణలు వాస్తవమా.? ఆ కేసులో నిందితులుగా ఆరోపించబడుతున్న అవినాష్ రెడ్డి వాదనలో వాస్తవం ఉందా అనే నిజం ఇప్పటికైనా ప్రజలకు తెలియాలి. ఆ తెలియచెప్పాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది.
మరి ఆ దిశగా పోలీస్ శాఖ అడుగు ముందుకేస్తే ఆ అడుగుల చప్పుడుకే వైసీపీ పునాదులు కదిలే అవకాశం ఉంది. ఇలా ఈ ఒక్క కేసు పరిష్కారంతో అటు బాధిత కుటుంబానికి న్యాయం చేసినట్లవుతుంది, ఇటు ప్రజలకు కూటమి ప్రభుత్వ పని తీరు మీద సదాభిప్రాయం కలుగుతుంది, అలాగే తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీని పూర్తిగా సమాధి చేసే అవకాశం వస్తుంది.
ఇలా ఒక్క దెబ్బతో మీరు ఫలాలను అందుకునే అద్భుత అవకాశం కూటమి చేతిలో ఉండి కూడా దానిని ప్రభుత్వ పెద్దలు సరైన తీరులో వినియోగించలేకపోతున్నారు అనే విమర్శలను మూటకట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేసి వివేకా హత్య కేసులో ‘సునీతకు న్యాయం…ప్రజలకు నిజం’ తెలియచెప్పాలని ఆశిద్దాం.




