వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి చాలా అదృష్టవంతుడే అని చెప్పాలి. ఆయనను అరెస్ట్ చేసి లోపల వేసేందుకు సీబీఐ అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా వారి చేతికి చిక్కకుండా తప్పించుకొంటున్నారు.
తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగాల్సి ఉండగా, అక్కడా ఆయనకు మళ్ళీ అదృష్టం కలిసివచ్చింది. ఈసారి ఆయన చంద్రబాబు నాయుడు కేసు వలన తృటిలో తప్పించుకోగలగడం విశేషం.
ఈ కేసులో సునీతా రెడ్డి తరపున వాదిస్తున్న సిదార్ద్ లూద్ర ఏపీ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు కేసును వాదించడానికి విజయవాడకు వెళ్ళడంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు విచారణను వాయిదా వేయవలసిందిగా సునీతారెడ్డే కోరవలసి వచ్చింది. ఆమె అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
వైసీపి ఎవరి (చంద్రబాబు నాయుడు)పై పగబట్టి జైలుకి పంపిందో వారి కేసు కారణంగానే సుప్రీంకోర్టులో ఈరోజు కేసు విచారణ వాయిదా పడటం, ఎవరైతే ఆవినాష్ రెడ్డిని జైలుకి పంపించాలని ప్రయత్నిస్తున్నారో వారే (సునీతా రెడ్డి) ఆయనకు మూడు వారాలు గడువు దొరికేలా చేయడం చూస్తే ఆయన చాలా అదృష్టవంతుడే అనిపించకమానదు.
ఒకవేళ ఇవాళ్ళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరిగి ఆయన ముందస్తు బెయిలును రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉంటే ఆయన హైదరాబాద్‌లోని చంచల్ గూడా జైలుకి పోవలసివచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు కేసు పుణ్యమాని తృటిలో తప్పించుకోగలిగారు.
ఇకపై చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టిడిపి నేతలపై వరుసపెట్టి కేసులు వేస్తూ, అరెస్ట్ చేస్తూనే ఉంటామని మంత్రి రోజా బహిరంగంగానే చెప్పేశారు కనుక ఆ కేసులు వాదించేందుకు సిదార్ద్ లూద్ర విజయవాడలోనే ఉండిపోయే పరిస్థితి వస్తుందేమో?ఆ కారణంగా సుప్రీంకోర్టులో ఆవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ కూడా వాయిదా పడుతూనే ఉంటుందేమో?ఎంత విచిత్రం?



