కాకాణి మాటలన్నీ చంద్రబాబు చెప్పినవేగా?

kakani-govardhan-reddy-pinnelli-ramakrishna-reddy

శుక్రవారం వైసీపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నెల్లూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ఇదివరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌, వైసీపి నేతలు, అధికారులను ఉద్దేశ్యించి మాట్లాడిన మాటల్లాగే ఉండటం విశేషం.

ADVERTISEMENT

ఇంతకీ కాకాణి ఏమన్నారంటే, “పిన్నెల్లిపై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టిస్తే హైకోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చి బయటకు పంపించింది. మామీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎంతమందిని అరెస్ట్ చేసి జైళ్ళకి పంపించినా మేము భయపడే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు ఇదేవిదంగా వ్యవహరిస్తుంటే భవిష్యత్‌లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇటువంటి పరిణామాలే టిడిపి నేతలు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాము.

పదవీ అధికారం శాశ్వితం కావని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడుని చూసి అధికారులు రెచ్చిపోతే మేము అధికారంలోకి రాగానే మీ అందరిపై చర్యలు తీసుకుంటాము.

వచ్చే ఎన్నికలలో ఓడిపోతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ హైదరాబాద్‌ వెళ్ళిపోతారు కానీ అధికారులందరూ ఇక్కడే ఏపీలోనే రిటైర్ అయ్యేవరకు పనిచేయాలనే విషయం మరిచిపోవద్దు. కనుక అధికారులందరూ ఎవరికీ భయపడకుండా నిర్భయంగా, నిష్పక్షపాతంగా మీ డ్యూటీలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.

గతంలో జగన్‌ ప్రభుత్వం టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నప్పుడు వారూ ఇదే చెప్పారు. ఇలాగే హెచ్చరించారు. అయితే చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 5 ఏళ్ళపాటు జగన్‌, వైసీపి నేతలు చాలా స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకునేవారు.

చంద్రబాబు నాయుడు ఏనాడూ అధికారులను వారిపైకి ఉసిగొల్పలేదు. అలాగే టిడిపి న, కార్యకర్తలు కూడా వైసీపి విషయంలో చాలా సంయమనం పాటించేవారు. అందుకే జగన్‌ ఎటువంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర చేయగలిగారు.

చంద్రబాబు నాయుడి ఈ మెతక వైఖరి, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను ఎదుర్కోవాలని అనుకోవడం వలననే జగన్‌ గెలవగలిగారని విమర్శలు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి.

కనుక ఆయనను ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్‌ కూడా ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించి ఉండి ఉంటే ఎన్నికలలో ఓడిపోయినా నేడు ఇటువంటి దుస్థితి కలిగేదే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ జగన్‌ పాలన ఏవిదంగా సాగిందో అందరూ చూశారు.

అయినా నేటికీ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడే ఉన్నారు. జగన్‌, వైసీపి నేతలు “చూసుకుందాం రా…” అంటూ ఎంతగా సవాళ్ళు విసురుతున్నప్పటికీ సంయమనం కోల్పోకుండా జగన్‌, వైసీపి నేతలు చేసిన తప్పులు, పాపాలకు చట్టబద్దంగానే చర్యలు తీసుకుంటున్నారు.

కనుక నేడు జగన్‌, వైసీపి నేతలు అనుభవిస్తున్నవన్నీ వారి ఖర్మ ఫలాలే తప్ప చంద్రబాబు నాయుడు ప్రతీకార చర్యలుగా పరిగణించలేము.

జగన్, వైసీపి నేతలు తమ తప్పులని, పాపాలను ఒప్పుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇలా మిడిసిపడటం వలననే ప్రజలు తమని తిరస్కరించారని గ్రహించకుండా మాట్లాడుతుండటం చూస్తే వారికి ప్రజలు విధించిన ఆ శిక్ష కూడా సరిపోదనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories