తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దాని అధినేత కేసీఆర్, ఆ పార్టీ మూల స్థంభం వంటి హరీష్ రావుల పాలిట కాళేశ్వరం కేసు ఉరి తాడులా బిగుసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అందువల్లే రేవంత్ ప్రభుత్వం కమీషన్ చేత దానిపై విచారణ జరిపిస్తున్నా లైట్ తీసుకున్నారు.
కానీ ఎప్పుడైతే ఆ నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారో అప్పుడే కేసీఆర్, హరీష్ రావు మేల్కొన్నారు. దానిని అడ్డుకోవడానికి హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆవిదంగా దానికి బ్రేకులు వేయగలమని భ్రమ పడ్డారు.
ఒకవేళ ఆ కేసుని సీఐడీకి అప్పగించినా దానితో చెడుగుడు ఆడుకునేందుకు వారు సిద్దంగానే ఉన్నారు. కానీ వారు కలలో కూడా ఊహించనివిధంగా ఆ కేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించి వారికి పెద్ద షాక్ ఇచ్చారు.
కనుక ఇప్పుడు బంతి మోడీ కోర్టులో పడింది. కనుక వారు ఏవిదంగా ‘సర్వ్’ చేస్తారో చూడాలి. ఈ కేసుని సీబీఐకి అప్పగించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టే బాధ్యతని, ఆ చెడ్డపేరుని సిఎం రేవంత్ రెడ్డి తెలివిగా కేంద్రానికి అప్పగించేశారు.
ఒకవేళ కేసీఆర్‌ని ప్రధాని మోడీ ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఇదే చెప్పుకొని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంచుకున్నారు.
తెలంగాణలో ఎప్పటికైనా బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ కూడా కోరుకుంటున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి అందించిన ఈ బలమైన ఆయుధాన్ని ఎలా వాడుకుంటారో చూడాలి.
సీబీఐ విచారణకు ఆదేశించి కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేయిస్తే బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి, బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది.
కనుక ఈ కేసుతో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునేందుకే మొగ్గు చూపవచ్చు. అందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగానే ఉందని కల్వకుంట్ల కవిత బయటపెట్టారు కూడా. కనుక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కధని ప్రధాని మోడీ ఏవిదంగా ముగించబోతున్నారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.




