తాను రాజకీయాల్లోకి రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని లోకనాయకుడు కమలహాసన్ అన్నారు. ఒకవేళ తాను కనుక రాజకీయాల్లో అడుగుపెడితే రచ్చరచ్చేనని హెచ్చరించారు. ఇప్పటివరకైతే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని, వస్తే మాత్రం అది మామూలుగా ఉండదన్నారు. ఆరు దశాబ్దాలుగా తమిళనాడుకు రాజకీయ నాయకులు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం కమల్, చేసిన వాగ్దానాలను ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఉన్న అర్హతలు తనకే కాదు, ప్రజలకు కూడా తెలియదని కమల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి చుట్టూ ఏళ్ల పాటు తిరగడం అర్హతగా భావించకూడదని, తాను ఒక న్యాయవాది కుమారుడినని, అంతమాత్రాన తాను కోర్టులో ఏదైనా కేసులో వాదన వినిపించేయగలనని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. తమ లాంటి వాళ్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని, రాజకీయాల్లో అడుగుపెడితే మామూలుగా రామని, తుపాకులు చేతపట్టుకుని వస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.



