సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ ఖాతాలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ వచ్చి చేరనుంది. బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ ను కొనసాగిస్తూ… ఒంటికాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా బయోపిక్‌ను తీసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ పాత్రలో నటించడానికి కంగనా రనౌత్‌ను నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఈ పాత్ర కోసం కంగనా, కృతి సనన్‌లలో ఎవరో ఒకర్ని తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారట. చివరికి కంగనాకే ఎక్కువ మంది మొగ్గు చూపడంతో ఆమెను సంప్రదించినట్లు ప్రముఖ బాలీవుడ్ టాబ్లాయిడ్ ప్రచురించింది. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చిత్రంలో నటిస్తోన్న కంగనా రనౌత్, షూటింగ్ పూర్తికాగానే అరుణిమ చిత్రానికి సంతకం చేయనున్నట్లు సమాచారం.
60 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు ఎవరనే విషయం ఈ నెలాఖరులోగా వెల్లడించనున్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అరుణిమ సిన్హాను 2011లో నడుస్తున్న రైలు నుంచి తోసేశారు. దీంతో ఆమె ఒక కాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ స్థైర్యం తెచ్చుకుని ఒంటికాలుతోనే ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆదర్శంగా నిలిచింది.


