ప్రస్తుతం ఏపీలో రోడ్ల దుస్థితిపై పక్క రాష్ట్రాలు కూడా విమర్శలు చేసే స్థాయికి తీసుకువచ్చారు ప్రస్తుత పాలకులు.డబుల్ రోడ్ ఉంటే తెలంగాణ అదే సింగల్ రోడ్ ఉంటే ఆంధ్రా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ఏపీ రోడ్ల వైభవాన్ని అక్కడి ప్రజలకు కూడా తెలియచేసారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రోడ్ల పరిస్థితి అయితే హమాస్ చేతికి చిక్కిన ఇజ్రాయిల్ ప్రజల మాదిరి తయారయ్యింది. రోడ్ల మధ్య గుంతలు కాదు గుంతల సందులలో రోడ్డు కనపడుతున్న దృశ్యాలు ఎన్నో పత్రికలలో, న్యూస్ ఛానెల్స్ లో చూస్తూనే ఉన్నాం.
వచ్చేసింది వచ్చేసింది మన జగనన్న రోడ్లు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియోను టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ తమిళనాడు – ఆంధ్రా మధ్య ఉన్న రోడ్ల వ్యత్యాసాన్ని చూడడండి అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఏపీలో పలు ప్రాంతాలలో ఉన్న రోడ్ల దుస్థితిని టీడీపీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
జగనన్న వేసిన అద్దంలాంటి రోడ్లు ఇవే చుడండి ఇందుకేనా రాష్ట్రానికి మరోసారి జగన్ కావాలి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏలూరు నడి బొడ్డున ఉన్న నీటితో నిండిన గుంతలు పడ్డ శ్రీ కృష్ణ దేవరాయ మున్సిపల్ హై స్కూల్ రోడ్లను పోస్ట్ చేశారు. అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లయితే మినీ కాలువను తరపిస్తుంది.అక్కడ ఇక్కడ అని తేడా లేదు జగన్ తీర్మానించిన ఏపీ మూడు రాజధానులలో రోడ్ల పరిస్థితి ఇదేతీరుగా ఉంది.
గతంలో కూడా జనసేన ఇదేతరహా పోస్టులతో సోషల్ మీడియాలో ఏపీ రోడ్ల పరిస్థితిని ట్రెండింగ్లో ఉంచింది. అయితే అప్పుడు ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం పై దుష్ప్రచారం మొదలుపెట్టిందంటూ ప్రతివిమర్శ చేసి తప్పించుకుంది. ఆత్మ సాక్షి లేకుండా తన సాక్షిలో జగన్ అద్దం లాంటి రోడ్ల నిర్మాణం చెప్పట్టారు..,అది కూడా దేశంలో ఎక్కడ లేని కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఈ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంటూ తెగ ప్రచారం చేశారు.
జగనన్న పాలనలో రోడ్లకు మహర్దశ వచ్చింది…ఏపీ ముఖ్య చిత్రం మారిపోయింది.., మునుపెన్నడూ చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నాం అంటూ బ్లూ మీడియా ప్రచారాలు, వైకాపా నాయకుల ఆర్భాటాలు అంతా తామరాకు మీద పడిన నీటి బొట్టు మాదిరి మారిపోయింది. అయితే ఇప్పుడు రోడ్ల మీద కనపడుతున్న ఈ గుంతలు కూడా టెక్నాలజీ లో లోపం అంటారో లేక ఇవి కూడా ప్రతిపక్షాలు గ్రాఫిక్స్ చేసి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అంటూ తమ వైఫల్యాలను సమర్ధించుకుంటారో.!
సామజిక సాధికార యాత్రలో రోడ్ల మీదకు వస్తున్నా వైకాపా నాయకులైనా జగన్ కు ఈ రోడ్ల పరిస్థితి వివరించి ఇప్పటికైనా ప్రజలకు ఈనరకకూపం నుండి విముక్తి కల్పించాలంటూ టీడీపీ శ్రేణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తన కళ్ళకు కట్టుకున్న గంతలు తీసి రోడ్ల మీద ఉన్న ఈ గుంతలు చూడాలని ఆశిద్దాం. అద్దం లాంటి రోడ్లు ఆశించే అత్యాశాపరులం కాదు కేవలం గుంతలు లేని రోడ్లు నిర్మిస్తే చాలు., కొత్త టెక్నాలజీ అవసరం లేదు ఉన్న టెక్నాలజీ ని వాడి రోడ్ల నిర్మాణం చేస్తే చాలు మహా ప్రభో అంటున్నారు ఏపీ ప్రజలు.




